వికటించిన గర్బా డాన్స్!

గుజరాత్‌: దసరా నవరాత్రుల సందర్భంగా వన్యప్రాణులతో గర్బా డాన్స్ చేసిన ముగ్గురు మహిళలపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వీరిలో ఓ 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌ లోని జునాగఢ్ లో దసరా నవరాత్రుల సందర్భంగా గర్బా నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మహిళలు చేతిలో నాగుపాములను పట్టుకుని నృత్యం చేశారు. మరో మహిళ ఓ చేతిలో కత్తి పట్టుకుని.. మరో చేతిలో పామును ఆడిస్తూ విన్యాసాలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్త అటవీ శాఖ అధికారులకు చేరడంతో వారు సదరు మహిళలను గురువారం అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వహకుడితోపాటు పాములను సరఫరా చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలు, బాలిక సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ముగ్గురు మహిళలు ఒక నాగుపాము, రెండు విషపూరితం కాని పాములను పట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదు చేశాం. ఆ  ఉత్సవాలను ఏర్పాటుచేసిన వ్యక్తులు, మహిళలకు పాములు సరఫరా చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశాం’ అని అటవీ శాఖ అధికారి సునీల్ బెర్వాల్ తెలిపారు.