ప్రయాణికుడ్ని కాపాడిన ఆర్పీఎఫ్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు కింద పడబోయిన ఓ ప్రయాణికుడిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది. శనివారం కోయంబత్తూరు రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించాడు. ఇదే క్రమంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కింద పడబోయాడు. అయితే, మెరుపు వేగంతో స్పందించిన ఆర్పీఎఫ్ సిబ్బంది… ఆ ప్రయాణికుడిని వెంటనే కోచ్ లోకి నెట్టేశాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. సమయానికి ఆర్పీఎఫ్ సిబ్బంది అక్కడలేకపోయి ఉంటే ప్లాట్ ఫాం, రైలుకి మధ్య ఉన్న సందులో అతడు పడి ప్రాణాలు కోల్పోయేవాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోని రైల్వే శాఖ అధికారులు ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రయాణికులు కదులుతున్న రైలును ఎక్కొద్దని సూచించారు.