శానిటరీ ప్యాడ్స్‌తో గర్బా నృత్యం

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గర్బా డ్యాన్స్ చాలా పాపులర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మహిళలు, పురుషులు అన్న భేదం లేకుండా, చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా అందరూ ఈ డ్యాన్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ఏడాది గర్బా డ్యాన్స్‌ను పలు ప్రదేశాలలో వినూత్నంగా నిర్వహించారు. సామాజిక అంశాలపై అందరికీ అవగాహన కల్గించేలా కొన్ని చోట్ల గర్బా డ్యాన్స్ చేశారు. హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై అవగాహన కల్గించేలా డ్యాన్స్‌ చేయగా మరో చోట గర్భిణీలతో ఉత్సాహంగా ఈ డ్యాన్స్‌లు నిర్వహించారు. తాజాగా సూరత్‌తో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ టెక్నాలజీ టీచర్లు, విద్యార్థినులు గర్బా డ్యాన్స్ వినూత్నంగా నిర్వహించారు. చేతిలో శానిటరీ ప్యాడ్స్ పట్టుకొని వాటిపై అందరికీ అవగాహన కల్గించేలా డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో యువకులు కూడా ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.