పెద్ద పులుల మధ్య భీకర పోరాటం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

రెండు పెద్ద పులుల మధ్య సాగిన భీకర పోరాటం యుద్ధాన్ని తలపించింది. రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వుడ్ జోన్ గా గుర్తింపు ఉన్న ఈ పార్క్ లోని పులుల సంరక్షణ కేంద్రంలో టీ-57, టీ-58 అనే రెండు పులులు బుధవారం హోరాహోరీగా తలపడ్డాయి. పోరు తారాస్థాయికి చేరగానే టీ 39 అనే మరో పులి పొదల్లోకి పారిపోయింది. ఈ పెద్దపులుల ఫైటింగ్ కు సంబంధించిన వీడియోను అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. “రెండు పులుల మధ్య పోరాటం ఇలాగే ఉంటుంది, భీకరంగా.. ఒళ్లుగగుర్పొడిచేలా! తమ ఇతర జంతువులు వస్తే పులులు ఇలాగే స్పందిస్తాయి. ప్రాణాలకు తెగించి పోరాడుతాయి” అని పర్వీన్ ట్వీట్ చేశారు.

అయితే ఈ యుద్ధంలో పులులకు తీవ్రగాయాలేవీ కాలేదని పర్వీన్ మరో ట్వీట్‌లో తెలిపారు. ఈ రెండు పులులు షర్మిలి అనే ఆడ పులికి పుట్టిన సంతానం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి ఇప్పటి వరకు 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. “ఇది అత్యంత అరుదైన వీడియో” అని ఓకరంటే..”ప్రకృతి అంటే అంతే..అక్కడి పోరాటాలు ఇలాగే ఉంటాయి” అని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.