న్యూస్ ఆర్బిట్ డెస్క్
ఇటీవలి కాలంలో పెళ్లి అంటే ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ హడావుడి తప్ప మరేంలేదు అన్నట్లుగా మారింది. పెళ్లికి వచ్చిన గెస్ట్‌లు కనులారా ఆ తతంగాన్ని చూడకపోయినా ఫరవాలేదు. ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ పనికి మాత్రం ఆటంకం కలగడానికి వీలు లేదు. రకరకాలుగా, కొత్త కొత్త భంగిమల్లో వధూవరులను నిలబెట్టి ఫొటోలు తీస్తున్నారు. నిశ్చితార్ధానికీ, పెళ్లికూ కూడా ఇదే తంతు. ఇందుకు వేలు కాదు, లక్షల్లో ఖర్చు చేస్తున్నారు.
కేరళలో ఒక జంట ఇలాగే ఫొటోషూట్‌కు రెడీ అయింది. ఎక్కడో తెలుసా? ఒక నదిలో, పడవపై కూర్చుని. అమ్మాయి అబ్బాయి ఇద్దరూ పడవపై కూర్చుని ఒకరి కళ్లల్లోకి ఒకరు తన్మయత్వంతో చూస్తుంటారు. అబ్బాయి చేతిలో అరిటాకు ఉంటుంది. ఇదీ సీను. దీనిని షూట్ చేయాలి. అంతా బాగానే ఉంది. పడవను కాస్త ఊపుతూ షూట్ చేద్దామని వీడియోగ్రాఫర్ అనుకున్నాడు. అలాగే ఊపడం మొదలుపెట్టేసరికి పడవ కాస్తా తల్లకిందులయింది.
ఈ షూట్ నిర్వహించిన వెడ్ప్లానర్ వెడ్డింగ్ స్టూడియో వారు ఈ వీడియోను నెట్లో పెట్టగానే వైరల్ అయింది. ఫేస్బుక్ ఒక్కదాంట్లోనే రెండు లక్షల మందికి పైగా దీనిని చూశారు. నవ్వుల్లో ముంచెత్తే ఈ సంఘటన కొత్త జంట ఎంజాయ్ చేశారని వెడ్ప్లానర్ తెలిపింది. మీరూ చూడండి.