ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు

Visual Story by NewsOrbit

సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్గిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఏపి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ రద్దు చేస్తానని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల ముందు వైసీపీ అధినేత హోదాలో హామీ ఇచ్చారు.

అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహనరెడ్డి సీపీఎస్ ను రద్దు చేయకపోవడంతో సెప్టెంబర్ 1న తాడేపల్లిలోని సీఎం ఇంటి ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.

ఆ క్రమంలో సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను అరెస్టు చేశారు.

కొందరు ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఉద్యోగులపై కేసులు నమోదు చేయడంపై  తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసుల వ్యవహారంపై రాష్ట్ర  ప్రభుత్వం పునరాలోచన చేసింది.

గత నెలలో ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద కేసుల ఉపసంహరణపై చర్చించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి బొత్స హామీ ఇచ్చారు. తాజాగా ఉద్యోగ సంఘ నేతల విజ్ఞప్తి తో కేసులు ఉపసంహరించుకున్నట్లుగా మంగళవారం ప్రకటించింది.