Categories: వ్యాఖ్య

ఈ ఎన్నికల్లో నా హీరో రైతు

Published by
Siva Prasad

ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో నాకు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా రైతు కనిపిస్తున్నాడు. నాయకులే కాదు, పౌరసత్వం ఉన్న వారెవరైనా పోటీ చేయొచ్చు కదా! ఈ ఎన్నికల రుతువులో నన్ను బాగా ఆకట్టుకున్న పోటీదారు రైతే. ఎన్నికలంటే ఓట్లు..సీట్లు..మద్యం..నగదు..పరస్పర దూషణ భీషణ ప్రచారాల ఫీట్లు మాత్రమే కాదు. ఎన్నికల కాలమంటే సగటు పౌరుడి నిరసన జ్వాలకు అద్దం పట్టే అసలు సిసలు అనలవేదిక అని అర్థం చెప్తున్నాడు రైతు. గెలుపు గుర్రాలెవరో తెలుసుకోవాలని నాకంత ఆసక్తి లేదు. కౌంటింగ్ రోజు కోసం నరాల తెగే ఎదురు చూపుల ఆత్రం లేదు. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం రుచి చూపించిన అనుభవం అలాంటిది మరి. ఏలికలు బాగుపడ్డారే కాని దేశం పెద్దగా బావుకున్నది కూడా లేదు కాబట్టి రొటీన్ ఎన్నికల పర్వం మీద నాలాంటి వారికి కొత్తగా అనురక్తి ఏం పుట్టుకొస్తుంది చెప్పండి! అయితే హక్కుల అణచివేతలో, ద్వేషమే తన ఆత్మగా ప్రకటించుకోవడంలో  తనకెవరూ చరిత్రలో సాటిరారని చాటిచెప్పిన ప్రస్తుత ప్రభుత్వం మీద నాకున్న అభ్యంతరాలు నాకున్నాయి. కానీ ఈ సారి ఎన్నికల్లో నా హీరో అభ్యర్థి ఎవరంటే అతను రైతే. అందుకే ఈ ఎన్నికలు కనీసంగానైనా నన్ను కదిలించాయి.

గెలవడానికి ఎవరు ఎన్ని తంటాలు పడుతున్నారో చూస్తున్నాం. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో వింటున్నాం. ఒకరి మీద ఒకరు ప్రపంచంలోని బురదనంతా తెచ్చి ఎలా ఎత్తిపోసుకుంటున్నారో ముక్కు మూసుకుని మరీ చోద్యం కంటున్నాం. తుచ్ఛాతి తుచ్ఛమైన, నీచాతి నీచమైన, హీనాతి హీనమైన వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రచారాలు ఎంత రోత పుట్టిస్తున్నాయో గమనిస్తున్నాం. గెలవడమే ధ్యేయంగా దేశం పరువు ప్రతిష్ఠలనే పణంగా పెట్టిన యోధాను యోధుల్ని వీక్షిస్తున్నాం. సింహాసనం తప్ప మరో ఆసనం ఏదీ అధిష్టించడం ససేమిరా ఇష్టం లేని నాయకమ్మన్యుల కుమ్ములాటగా ఎన్నికలు ప్రసిద్ధికెక్కాయి. ఇక ఏముందిలే అనుకుంటున్న తరుణంలో రైతు బ్యాలెట్ మీద ఉదయించడం మొదలు పెట్టాడు. అదే నన్ను ఆకట్టుకుంది.

రైతే రాజన్నారు. అన్నదాతగా రైతును కీర్తించి కీర్తించి అలసిపోయారు. దేశానికి వెన్నెముకగా రైతును వర్ణించి వర్ణించి పొంగిపోయారు. కడకు రైతుకు అన్నం లేకుండా  చేశారు. రాజు కాదు కదా బంటుగా కూడా బతికే యోగ్యత లేకుండా చేశారు. దేశానికేమో గాని తన వెన్నెముకనే విరిచి పారేశారు. రైతు ఘోష వినే నాధుడే కరువయ్యాడు. రైతు కష్టాలు కడగండ్లు పట్టించుకునే నాయకుడే లేకపోయాడు. పండించిన పంటకే కాదు రైతుకే గిట్టుబాటు లేని కాలం దాపురించింది. చేతులతో చల్లే విత్తనాల నుంచి చేతికి అందిన పంట దాకా సమస్తంలోనూ రైతు దగాపడ్డమే కష్టార్జితంగా మిగులుతుంది. మన మట్టిమనిషి పెద్దగా కోరికలేమీ కోరలేదు. కనీస మద్దతు ధర కావాలన్నాడు. పంటకు భీమా అడిగాడు. విత్తనాల్లోనే పురుగుల్ని నింపి తర్వాత పురుగుల మందుల కోసం కార్పొరేట్ల కాళ్ళూవేళ్లూ పట్టుకునేలా చేసే దుర్మార్గం నుంచి తనను కాపాడమని  ప్రాధేయపడ్డాడు. రుణాలు విదిలించి తర్వాత అయిదేళ్లకోసారి ఎన్నికలప్పుడు తోచింది మాఫీ చేస్తామని చెప్పే దొంగ నాటకాలు ఆపండయ్యా బాబూ అని మొత్తుకున్నాడు. పదో పరకో పంట సాయం అంటూ రాల్చి ఓట్లు రాబట్టుకునే చీటింగ్ పనులు మానుకోమన్నాడు. నిజంగా ప్రేమ వుంటే దీర్ఘకాలిక ప్రణాళికలు రచించమన్నాడు. కురిసే మేఘాల కంటే కూడా నాయకులు విసిరే రుణాల వైపే మొహం వాచేలా చూడాల్సిన దుస్థితి నుంచి బయట పడేయమని రోదించాడు. నిటారుగా నిలబడే రోజు కోసం..పొలంలో నవ్వుతూ గెంతులేసే రోజు కోసం..మట్టి నుంచి కిరణాలు కిరణాలుగా దిగుబడి వచ్చి ఇంటిని వెలుగులతో నింపే రోజు కోసం కలలుగన్నాడు. ఆ రోజు రానేలేదు.  పురుగుల మందో ..ఉరితాడో..కరెంటు తీగో ఏదో ఒకటి తనను ఈ గట్టు మీంచి ఆవలి గట్టు మీదకు చేర్చే సహారాగా రైతు భావించే రోజు మాత్రం వచ్చింది.

అందుకే రోడ్డెక్కాడు. నాసిక్ నుంచి ముంబై వరకు గతేడాది నడిచి నడిచి అరికాళ్ళలో తిరగబడ్డ భారత భాగ్యోదయాన్ని చూపించాడు. ఆకాశం తల్లకిందులై అన్నదాత పాదంలో రక్తం గక్కుకుంది.  అంతకు ముందు అన్ని రాష్ట్రాల నుంచి రైతన్నలు పాద యాత్రలు చేసి ఢిల్లీని ముట్టడించారు. రోడ్ల మీద పాలు పారబోశారు. అవి తమ విన్నపాలుగా అర్థం చేసుకుంటారనుకున్నారు.  చెరకు పంటలు తగలబెట్టారు. అది తమ ఆగ్రహంగా గ్రహిస్తారనుకున్నారు. కూరగాయలు రహదారుల మీద క్రుమ్మరించారు. అది తమ చితికిన బతుకుల ఛిద్ర రూపంగా భావిస్తారని ఆశ పడ్డారు.  మిర్చికి నిప్పు పెట్టారు. జొన్న కంకుల మెడలు నరికారు. పసుపు పంటకు నెత్తురు పూసారు. ఏదో ఒకటి చేసి తమ దీనాతి దీనమైన నరకప్రాయమైన రైతు జీవితాలను పాలకుల కళ్ళకు కట్టేటట్టు చేయాలని తపన పడ్డారు. ఏం చేసినా ఎంత చేసినా రోడ్డున పడింది రైతు అధ్వాన్న జీవితమే కాని ఏలిన వారి కను రెప్పలనైనా తాకలేకపోయారు. అందుకే ఈ ఎన్నికల కాలంలో రైతు,  నాయకుడి వేషం కట్టాడు. ఓటు కోసం కాదు. పాలించే వారి గుండెల్లో కాసింత చోటు కోసం. వారి కనుకొలకుల నుంచి ప్రసరించే కాంతి కొంతైనా తమ వైపు ప్రవహిస్తుందన్న ఆశతోనే ఈ పోటీ. మొన్న నిజామాబాద్‌లో 176 మంది రైతులు కవితమ్మ మీద పోటీకి దిగి ప్రభువుల కన్నెర్రకు గురయ్యారు. ఎన్నికల కమిషన్‌కు చుక్కలు చూపించారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీగారికే ఎదురు తిరిగారు. వారణాసిలో నామినేషన్లు వేశారు. పోలీసులు..అధికారులు..బీజేపీ కార్యకర్తలూ అంతా అడుగడుగునా అడ్డంకులు కల్పించినా తెలంగాణా నుంచి వెళ్ళిన వారిలో 25 మంది నామినేషన్లు వేయగలిగారు. 111 మంది తమిళ రైతులు పోటీకి సిద్దపడితే ఒకరు మాత్రమే నామినేషన్ వేయగలిగారట.

రైతు నాగలి మోస్తున్నాడు క్రీస్తు శిలువ మోసినట్టు అని కవి శేషేంద్ర  అన్నాడు. కాని నాకిప్పుడు రైతు సూర్యుణ్ణి మోస్తున్న ఆకాశంలా కనిపిస్తున్నాడు. చీకట్లు బద్దలు కొట్టడానికి నాలుగు దిక్కులా గొడ్డళ్ళు విసురుతున్న బాహుబలిలా కనిపిస్తున్నాడు. గెలిచేది ఎవరో ఓడేది ఎవరో కాని …దేశం వెన్నెముక మీద సంతకం చేసేది మాత్రం రైతే అని తేల్చిచెప్పిన ఎన్నికలివి. అందుకే ఈ ఎన్నికలు నాకు ఆకర్షణీయంగా అద్భతంగా కనిపిస్తున్నాయి.

ఎప్పటికైనా ఏనాటికైనా రైతే గెలుస్తాడు

దేశం ఛాతీ చీల్చుకొని రైతు కొత్త పొద్దయి పొడుస్తాడు

ఈ నాటకాలు..ఈ బూటకాలు..ఈ క్రిమికీటకాలు

అన్నింటినీ  దగ్ధం చేసి నిజం నిప్పుల మీద రైతు రంకె వేస్తూ నడుస్తాడు

 

-ప్రసాదమూర్తి

Siva Prasad

Recent Posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. కొంద‌రు మ‌హిళ‌లు ఏడ్చేశారు.. మ‌రికొంద‌రు కొంగు చాపారు. ఇంకొంద‌రు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక‌,… Read More

May 17, 2024

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. దీనికి రీజ‌న్ ఎవ‌రు? అంటే..… Read More

May 17, 2024

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

రాష్ట్రంలో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ప్ర‌క్రియ కొన్ని… Read More

May 17, 2024

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ న‌మోదు ప్ర‌క్రియ అనూహ్యంగా పెరిగిన త‌ర్వాత‌.. రెండు వైపులా ఒక విధ‌మైన స్త‌బ్ద‌త… Read More

May 17, 2024

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More

May 17, 2024

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

Tragedy:  అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More

May 17, 2024

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More

May 17, 2024

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More

May 17, 2024

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల త‌ర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More

May 17, 2024

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

Brahmamudi May 17 2024 Episode 412:  దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More

May 17, 2024

May 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 17: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 17, 2024

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More

May 16, 2024

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More

May 16, 2024