Khairatabad Ganesh 2023: విఘ్నాధిపతిగా తొలిపూజ అందుకునే గణపయ్యను వాడవాడలా ఘనంగా పూజించే వేడుక దగ్గరకొచ్చేస్తోంది. వినాయక చవితి వస్తోందంటే ప్రజలు గణపతిని పరిపరి విధాలుగా ప్రార్ధించడమే గాకా, పరిపరి రూపాల్లో స్వామిని చూడ గోరుతారు. ఇక హైదరాబాద్ ప్రజల కు భాద్రపద మాసం వస్తోందంటేనే ఎంతో హుషారు వస్తుంది. వాడవాడలా గణపతి విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఖైరతాబాద్ మహా గణపతికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక్కో ఏడాది ఒక్కో ఎత్తుతో.. ఒక్కో ప్రత్యేక రూపంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి అంటే.. తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం ఆ మాటకొస్తే విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తే. 1954 వ సోమవారం నుండి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఏడాది స్వామి ఏ రూపంలో ఉంటాడు? ఎంత ఎత్తువుంటాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు.

గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. ఏడాదికోరూపంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతి రూపంలో కొలువుతీరనున్నాడు. శ్రీ దశమహా విద్యాగణపతి గా భక్తులను అనుగ్రహించనున్నాడు పార్వతీ తనయుడు. విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉండనుంది. ఇంత పెద్ద మట్టి బొమ్మ ప్రపంచంలో ఎక్కడా చేయబడే లేదు. అందువలన ఇది ప్రపంచ రికార్డు గా భావిస్తున్నారు. ఈ విగ్రహం చేయడానికి 100 టన్నుల పైన మట్టిని వాడారు. నాలుగు రాష్ట్రాలకు చెందిన 300 మంది పనిచేశారు. నిల్చున్న తీరులో ‘శ్రీ దశమహా విద్యాగణపతి’ విగ్రహం ఉండగా.. తలపై ఏడు సర్పాలు ఉండనున్నాయి. వెనక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. పది చేతులు ఉంటాయి. కుడి వైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు కింద నుంచి పైకి చేతిలో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ల వద్ద అటూ ఇటూ పది అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ప్రధాన మండపం రెండు వైపులా శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, శ్రీ వీరభద్ర స్వామి వార్ల విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటాయి. విగ్రహం తయారీ పనులు పూర్తయ్యాయి. ఈ సారి చవితి పండుగకు మూడు రోజుల ముందే భక్తులు విగ్రహాన్ని చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు.

గత ఏడాది నుంచి ఖైతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేస్తున్నారు. పర్యావరణ హితంగా నిర్మిస్తున్నారు. గతంలో ఏటా ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో వినాయక ప్రతిమ రూపొందించేవారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా పర్యావరణ హితునిగా గణేషుడిని రూపొందిస్తున్నారు. గణపతికి 11 రోజులు పూజలు చేసిన తర్వాత ఊరంతా నిమజ్జన కారక్రమంలో పాల్గొంటారు. 1954 నుండి పూజించబడిన గణేశుని రూపాల నమూనాలను ప్రజల దర్శనం కోసం ఉంచారు.