Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? అనేది ఊహించడం కష్టతరంగానే ఉంది. ‘న్యూస్ ఆర్బిట్’ ప్రత్యేక పరిశీలన ద్వారా ఆత్మకూరు ఉప ఎన్నిక, బద్వేల్ ఉప ఎన్నిక, తిరుపతి ఎంపి స్థానానికి ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది..? అనేది ముందుగానే ఇవ్వడం జరిగింది. పోలింగ్ జరిగిన రోజే ఈ పార్టీకి ఇంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది..? ఆయా పార్టీలకు సుమారుగా ఇన్ని ఓట్లు వస్తాయన్న అంచనాతో ‘న్యూస్ ఆర్బిట్’ కథనాన్ని ఇవ్వడం జరిగింది. అయితే మునుగోడు ఉప ఎన్నిక మాత్రం అంచనాలకు అందడం లేదు. ఎందుకంటే.. ఒక్కో రోజు ఒకొక్క పార్టీ హైలెట్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో లేదు, ఎక్కడో మూడవ స్థానంలో ఉందని అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొంది. మహిళా సెంటిమెంట్ ను బాగా రగిలిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధాన పార్టీలకు ధీటుగా ఖర్చు పెడుతున్నారు. అంతర్గత వ్యవహారాలు చూస్తున్నారు. అన్ని వనరులను సమకూర్చుకుని సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఐ ప్యాక్ స్ట్రాటజీ కూడా వర్క్ అవుతుండటంతో డిజిటల్ మీడియా పరంగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది.

Munugode Bypoll: టీడీపీ సానుభూతిపరులు ఎటు..?
ప్రజల్లో ప్రచారపరంగా బీజేపీ ముందంజలో ఉంది. పంపిణీల పరంగానూ బీజేపీ ముందు ఉంది. వ్యవస్థలను వాడుకోవడంలో, సెంటిమెంట్ ను రగిలించడంలో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. ఇలా మూడు పార్టీలు ఎవరి ప్రయత్నాల్లో, ఎవరి అంచనాల్లో వాళ్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంది అని అంచనా వేయడం కష్టమే. అయితే.. మనుగోడులో టీడీపీ పరిస్థితి ఏమిటి..? తెలుగు దేశం పార్టీ పోటీ చేయలేదు కదా..! ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఎంత ఉంది..? ఎటు వెళతాయి అనేది పరిశీలన చేస్తే..ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఓటు బ్యాంక్ బాగానే ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ ఓట్లు ఉండటంతో పాటు గౌడ, యాదవ, ముదిరాజ్ తదితర బీసీ వర్గాలకు చెందిన సుమారు 8 నుండి పది వేల వరకూ టీడీపీ ఓటు బ్యాంక్ ఉంటుంది. వీళ్లలో సుమారు మూడు వేల ఓట్ల వరకూ డబ్బు ప్రభావంతో మారే అవకాశం ఉన్నా మిగిలిన అయిదు వేల ఓట్లు టీడీపీ ఎవరికి చెబితే వాళ్లకు వేస్తారు.

టీడీపీ తీసుకునే నిర్ణయంతో ఆ అయిదు వేల ఓట్లతో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వెళ్లి పీసీసీ అధ్యక్షుడుగా ఎదిరారన్న భావనతో కాంగ్రెస్ కి ఓట్లు వేయాలని టీడీపీ అనుకుంటుందా..? లేదు భవిష్యత్తులో టీడీపీ – బీజేపీ పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని టీడీపీ భావిస్తుందా. ? చూడాలి మరి.! బీజేపీ అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తొంది. అంతర్గత సమావేశాల ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని టీడీపీ సానుభూతి పరుల ఓట్లు వేయించుకోవడానికి చర్చలు జరుగుతున్నాయనేది సమాచారం. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి మీద అభిమానం చావదు కాబట్టి కొందరు అటుగానూ ఆలోచించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అభ్యర్ధుల గెలుపు ఓటములో కొంత మేర టీడీపీ ఓటింగ్ ప్రభావం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.