25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Share

Nagari: ఏపి మంత్రి ఆర్కే రోజా ఆడియో ఒకటి రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇందులో కొత్తగా అయితే ఏమీ లేదు. ఎందుకంటే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గ వైసీపీలో రోజాకు వ్యతిరేకంగా గ్రూపులు ఉన్న సంగతి తెలిసిందే. గ్రూపులు ఎవరెవరు..? వాళ్ల బలమెంత.. ? ఈ కారణంగా నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడిందా..? రోజా బలం ఏమైనా తగ్గిందా..? టీడీపీ బలం ఏమైనా పెరిగిందా..? భాను ప్రకాష్ గెలిచే అవకాశాలు ఉన్నాయా..? అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే.. నగరి నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువ. బీసీల్లో ఎక్కువగా ముదిలియాస్ (తమిళ వలస ఓటర్లు) వర్గం నగరిలో ఎక్కువ. ఇతర బీసీ వర్గాలతో పాటు ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. 15,16 గ్రామాల్లో రెడ్డి సామాజికవర్గ పెత్తనం ఉంటుంది. ఆ తర్వాత క్షత్రియ సామాజికవర్గం 13 గ్రామాల్లో డామినేషన్ ఉంటుంది. విజయపురం, పుత్తూరు మండలాల్లో క్షత్రియ డామినేషన్ గ్రామాలు ఉన్నాయి. అలానే కమ్మ సామాజికవర్గ డామినేషన్ 15 – 16 గ్రామాల్లో ఉంటుంది.

RK Roja

Nagari: రెండు సార్లు బొటాబొటి మెజార్టీయే

రోజా నగరి నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో కేవలం 850 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2019 లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచిన సందర్భంలోనూ కేవలం 2,700 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. భారీ మెజార్టీ ఏమీ రాలేదు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తక్కువ ఓట్ల మెజార్టీయే వచ్చింది. గత ఎన్నికల్లో నిండ్ర మండలానికి చెందిన వైసీపీ కీలక నేత చక్రపాణి రెడ్డి (మాజీ మంత్రి చంగారెడ్డికి సమీప బంధువు) రోజాకు మద్దతుగా నిలిచారు. ఈయనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఆయన రోజాకు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. ఆ తర్వాత విజయపురం మండల నాయకుడు లక్ష్మీపతిరాజు కూడా రోజా వ్యతిరేక వర్గంలో ఉన్నారు. అలాగే కేజే కుమార్, శాంతిలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. శాంతి ఈడీ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్నారు. పుత్తూరు మండలానికి చెందిన అముల్ కూడా రోజాకు వ్యతిరేకంగా ఉన్నారు. వడమాటపేట మండలం నుండి జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి కూడా వ్యతిరేకవర్గమే. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక్కొ మండలానికి ఒక్కో కీలక నాయకులుగా ఉన్నారు. వీరంతా గత ఎన్నికల్లో రోజా గెలుపునకు పని చేశారు. వీరంతా పని చేస్తేనే బొటాబొటి మెజార్టీతో రోజా బయటపడ్డారు.

భానుప్రకాష్ కు వ్యతిరేకంగా సోదరుడు

మంత్రి రోజాకు తెలియకుండా ఆమె నియోజకవర్గంలో ఓ అభివృద్ధి కార్యక్రమాన్ని వ్యతిరేక వర్గం వాళ్లు నిర్వహించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రోజా వ్యతిరేక వర్గం వల్ల టీడీపీ నేత భానుప్రకాష్ వర్గం బలపడిందా ..? ఆయనకు గెలుపు అవకాశాలు ఏమైనా పెరిగాయా అంటే.. ? ఆయనకు ఓ పెద్ద చిక్కు ఉంది. భాను ప్రకాష్ కు వ్యతిరేకంగా ఆయన సొంత సోదరుడు (తమ్ముడు) జగదీష్ ప్రకాష్ ఉన్నారు. జగదీష్ ప్రకాష్ అడపదడపా తను సొంతంగా కార్యక్రమాలు చేస్తూ ఓ వర్గాన్ని నడుపుతున్నారు. ఈ వర్గం ఎప్పుడూ భానుప్రకాష్ కు వ్యతిరేకమే. భాను ప్రకాష్ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసే వాళ్లకు మద్దతు ఇచ్చేలా వర్గాన్ని తయారు చేసుకున్నారు జగదీష్ ప్రకాష్. ఇద్దరు అన్నదమ్ముల వద్ద గ్యాప్ బాగానే ఉంది.

 

రోజా రెండవ సారి ఎమ్మెల్యే అయిన తర్వాత సొంత వర్గాన్ని పెంచుకున్నారు. అయితే గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు ఆమెకు పని చేసిన వాళ్లే ఇప్పుడు ఆమె పక్కన ఉన్నారని అంటున్నారు. భానుప్రకాష్ కు ఉన్న పెద్ద మైనస్ సొంత కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. వీటిని రాజీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం లేదు. దీనికి తోడు తన సోదరుడితో సన్నిహితంగా ఉన్న వాళ్లను దూరం పెడుతున్నారు. అంతే కాకుండా భానుప్రకాష్ ఎమ్మెల్యేగానూ గెలవలేదు. అయినా తన చుట్టూ ఒక కోటరీ ఏర్పాటు చేసుకుని వాళ్లు చెప్పినట్లుగానే వింటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ బలోపేతానికి ఆయన తిరుగుతున్నప్పటికీ ఆయనకు ఫలితం రావడం లేదు. ఎందుకంటే అందరినీ కలుపుకుని వెళ్లలేకపోవడం, అందరినీ సమదృష్టితో చూడలేకపోవడం, వైసీపీలో ఉన్న వ్యతిరేకతను వాడుకోలేకపోవడం, సొంత తమ్ముడిని డీల్ చేయలేకపోవడం, కొంత మందిని మాత్రమే వెంట తిప్పుకుంటూ వాళ్లు చెప్పినట్లే నడుచుకోవడం, వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో ఆయన బలపడలేకపోతున్నారనే మాట వినబడుతోంది. రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో ఆయన అలా ఉన్నాడు అనే టాక్ నడుస్తొంది. తెలుగు దేశం పార్టీలోనే ఆయనకు వ్యతిరేక వర్గం ఉంది. ఇది రోజాకు ప్లస్ అవుతుంది.

ఈ నియోజకవర్గంలో ఇరు పార్టీలలోని నాయకులకు వ్యతిరేక వర్గాలు ఉండటమే వాళ్లకు మైనస్, ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఆర్ధిక విషయానికి వస్తే ఇరుపార్టీల నేతలకు ఇబ్బందిలేదు. తెలుగు దేశం పార్టీలో ఇవన్నీ సెట్ చేసుకుని గాలి భానుప్రకాష్ బలపడతారా, లోపాలను సరిదిద్దుకుంటారా.. మరో పక్క రోజా తన వ్యతిరేక వర్గంతో మాట్లాడి కొంత సెట్ రైట్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రోజా వ్యతిరేక వర్గాన్ని జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలు వెనుక ఉండి నడిపిస్తున్నారనే పార్టీలో అంతర్గతంగా వాదనగా ఉంది. దీంతో వైసీపీలో ఉన్న విభేదాలు అంత ఈజీగా సెటిల్ అయ్యే విషయాలు కాదు. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. రెెండు పార్టీల్లో ఉన్న ఈ విభేదాల కారణంగా నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాషపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం


Share

Related posts

Republic : రిపబ్లిక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన రామ్ చరణ్..

bharani jella

Pocharam Srinivas Reddy: పోచారంకు కరోనా పాజిటివ్ నిర్ధారణ..! ప్రముఖుల్లో గుబులు..!!

somaraju sharma

Guna Sekhar : బిగ్ బ్రేకింగ్: మరో చారిత్రాత్మక చిత్రాన్ని స్టార్ట్ చేసిన గుణశేఖర్..!!

sekhar