Vijayawada TDP: ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతున్నాయి. ఎన్నికల సమయానికి ఒక బ్లాస్టింగ్ జరిగేలా ఉందని భావిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడుగా కేశినేని నాని ఉండగా,. విజయవాడ పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జిగా సీనియర్ నేత, మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఉన్నారు. కేశినేని నాని రెండు సార్లు ఎంపిగా ఎన్నికైయ్యారు. ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే మనస్థత్వం ఆయనది. అయితే తాజాగా వారి మధ్య వచ్చిన వివాదం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం ఏమిటి.. కేశినేని నాని రెబల్ గా మారారా.. పార్టీ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు..రఘురాం ఉద్దేశం ఏమిటి అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే..

నెట్టెం రఘురాం 2020లో విజయవాడ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన టీడీపీలో విశ్చిన్నకమైన శక్తులు ఉన్నాయి. వాటి పని బడతాము. అవసరమైతే వాళ్లను పార్టీ నుండి బయటకు పంపించేస్తాము అని అన్నారు. త్వరలోనే పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తా, పార్టీ బలోపేతం చేస్తానంటూ కామెంట్స్ చేశారు. తాజాగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ పార్టీకి సంబంధించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, పార్టీకి నష్టం చేసేలా మాట్లాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి వెంటనే కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఓ లిస్ట్ పంపిస్తాను, ఆధారాలతో చర్యలు తీసుకుంటారా అంటూ కేశినేని నెట్టెంకు కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎవరి గురించి కామెంట్ చేశారు అనేది విజయవాడ పార్టీ నాయకులకు తెలుసు.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. కేశినేని నాని నిజంగా పార్టీకి నష్టపరుస్తున్నారా…పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారా.. అంటే కాదనే చెప్పవచ్చు. కాకపోతే ఆయనది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనస్థత్వం. టీడీపీలో చాలా మంది పార్టీ అధినేత, తదితర ముఖ్య నేతలకు భజన చేస్తుంటారు. క్షేత్ర స్థాయిలో పార్టీ వాస్తవ పరిస్థితిని చెప్పకుండా అంతా బాగుంది అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు. కొంత మంది పార్టీలో వాస్తవ పరిస్థితి తెలియజేస్తుంటారు. ఇందులో కేశినేని నాని రెండో కోవకు చెందిన వారిగా పేర్కొనవచ్చు. అందుకే ఆయన పార్టీ లోని లోపాలను, అంతర్గత వ్యవహారాలను కొంత ఓపెన్ గా ప్రస్తావిస్తుంటారు. అయితే ఇది పార్టీ శ్రేయోభిలాషులు చేసే పని. కానీ దీన్ని పార్టీ తప్పుగా అర్ధం చేసుకుంటే పార్టీకే నష్టం. అందరు భజన చేసే వారే ఉంటే వాస్తవ పరిస్థితులు పార్టీ పెద్దలకు తెలియవు.

పార్టీకి కంచుకోటగా ఉండాల్సిన ఉమ్మడి కృష్ణాజిల్లాలో నాయకులు గ్రూపులుగా విడిపోయి ఉండటం వల్ల బలోపేతం కావడం లేదనే మాట వినబడుతోంది. గన్నవరం సీటు గెలుస్తారో లేదో కూడా తెలియదు. అక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతున్నా ఎవరు పోటీ చేస్తారు అనేది క్లారిటీ లేదు. అక్కడ ద్వితీయ శ్రేణి నాయకుల్లో అయోమయం నెలకొని ఉంది. అదే పరిస్థితి గుడివాడలో ఉంది. ఈ నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఉంది. తిరువూరు నియోజకవర్గంలో కావాలనే టీడీపీ నేతలు కొందరు పార్టీ అభ్యర్ధిని ఓడిస్తుంటారు. వాళ్ల అధిపత్యం నిలుపుకోవడం కోసం పార్టీ అభ్యర్ధులనే ఓడించే నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. నూజివీడులో అసలు గెలవలేకపోతున్నారు.
విజయవాడలో జనసేన ప్రభావం ఉంది. ఇక్కడ జనసేనతో పొత్తు లేకపోతే గెలవలేని పరిస్థితి ఉంది. మైలవరంలో కీలకమైన పోటీ ఉంది. నందిగామలో గ్రూపులు ఉన్నాయి. మచిలీపట్నంలోనూ ఓట్ల చీలిక ప్రభావం ఉంది. పెడన, జగ్గయ్యపేట తదితర నియోజకవర్గాల్లోనూ గ్రూపులు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి. పార్టీలో గ్రూపుల వల్ల నష్టం జరుగుతుందని అన్న వాదన కేశినేనిది అయితే..పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా మాట్లాడటం వల్లనే సమస్యలు వస్తున్నాయని రఘురాం లాంటి వారి వాదనగా ఉంది. ఇద్దరిలో ఎవరి వాదన కరెక్టు అన్న అయోమయంలో పార్టీ ఉంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గంటల తరబడి రివ్యూలు అయితే నిర్వహిస్తున్నారు కానీ నియోజకవర్గాల్లో పరిస్థితి మారడం లేదని పార్టీలోని కొందరి వాదనగా ఉంది.