Allu Arjun-Vishal: ప్రముఖ హీరో విశాల్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న విశాల్.. ప్రస్తుతం రత్నం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సింగం సిరీస్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రియా భవాని శంకర హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో రత్నం మూవీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ విశాల్ రత్నం మూవీని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే తాజాగా తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. గతంలో తాను తెలుగులో కొన్ని చిత్రాలను వదులుకున్నారని.. అందులో అల్లు అర్జున్ మూవీ కూడా ఉందని విశాల్ వెల్లడించాడు. ఇంతకీ అల్లు అర్జున్, విశాల్ కాంబినేషన్లో మిస్ అయిన సినిమా మరేదో కాదు వరుడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా జంటగా నటించారు. తమిళం నటుడు ఆర్య విలన్ గా చేయగా.. సుహాసిని, ఆశిష్ విద్యార్థి, నరేష్, కిషోరి బల్లాల్, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీకి మణి శర్మ స్వరాలు అందించాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న వరుడు భారీ అంచనాల నడుమ 2010 మార్చి 31న విడుదలైంది. అయితే తొలి ఆట నుంచే ఈ చిత్రం నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. కనీసం అల్లు అర్జున్ అభిమానులను కూడా వరుడు మెప్పించలేకపోయింది. డైరెక్టర్ గుణశేఖర్ కంటెంట్‌పై కంటే విజువల్స్ మరియు గ్రాఫిక్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. తెర మొత్తం నటులు ఉన్నా.. గుణశేఖర్ ఎవ్వరినీ సరిగ్గా వాడుకోలేకపోయాడు. దాంతో బాక్సాఫీస్ వద్ద వరుడు మూవీ డిజాస్టర్ అయింది. కనీస వసూళ్లు కూడా అప్పట్లో ఈ చిత్రం రాబట్టలేకపోయింది.
ఇకపోతే ఈ సినిమాల్లో అల్లు అర్జున్ ఢీ కొట్టే విలన్ గా దివాకర్ పాత్రలో ఆర్య నటించాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు అతను పూర్తి న్యాయం చేశాడు. అయితే నిజానికి వరుడు మూవీలో విలన్ గా మొదట విశాల్ ను తీసుకోవాలని డైరెక్టర్ గుణశేఖర్ భావించాడట. విశాల్ ను కలిసి కథ కూడా చెప్పాడట. కానీ విశాల్ మాత్రం ఒప్పుకోలేదు. హీరోగా దూసుకుపోతున్న తరుణంలో విలన్ గా నటించేందుకు విశాల్ ఇండ్రెస్ట్ చూపించలేదు. ఈ కారణంగా ఆయన వరుడు మూవీని సున్నితంగా తిరస్కరించాడు. దాంతో విశాల్ కు బదులుగా గుణశేఖర్ ఆర్యను తీసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో విశాల్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. వరుడు సినిమాలో తనకు అవకాశం వచ్చిందని.. కానీ మనసు అంగీకరించకపోవడంతో వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. అలాగే ఇటీవల విడుదలైన లియో మూవీలో అర్జున్ పాత్ర కూడా మొదట విశాల్ వద్దకే వెళ్లింది. డేట్స్ సద్దుబాటు కాకపోవడంతో విశాల్ లియోను కూడా రిజెక్ట్ చేశాడు.