టికెట్ అయితే సంపాయించుకున్నారు. అది కూడా అనేక టెన్షన్లు..ఉత్కంఠలు.. వివాదాలు.. ఒకటా రెండా.. నరాలు తెగిపోయేంతగా!! బలమైన జనసేన అభ్యర్థి తనకు ఎక్కడ ఎసరు పెడతాడోనని కంటిపై కునుకు లేకుండా.. అహోరాత్రులు వేచి ఉన్నారు. అనేక దేవుళ్లకు కూడా మొక్కుకున్నట్టుగా ఉన్నారు. చివరకు టికెట్ దక్కింది. హమ్మయ్య అనుకున్నారు. అయితే.. ఇప్పుడు అసలు చిక్కు వచ్చిపడింది. అదే.. సొమ్ముల సమస్య. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
సిట్టింగ్ ఎమ్మెల్యేగానే ఉన్నా.. ఆయన దగ్గర బారీ మొత్తంలో సొమ్ములు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయనకు సొమ్ముల సమస్య పట్టుకుంది. టికెట్ దక్కించుకున్నా.. ఆయన ఆర్థిక ఇబ్బంది పడుతున్నారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా ఏం సంపాదించుకోలేదని, ఆయన మొత్తం ఆస్తి విలువ కేవలం మూడున్నర కోట్లు మాత్రమేనని ఒక చర్చ నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, వాహనాలు, ఇతర సంస్థల్లో పెట్టుబడులు కలిపి మొత్తం రూ.2 కోట్ల వరకు ఆస్తి ఉందని అంటున్నారు.
పొలాలు, ప్లాట్లు కలిపి మరో కోటిన్నర రూపాయల ఆస్తి మాత్రమే ఉందట. ఇక అప్పులు కూడా గోరంట్లకు అలానే ఉన్నాయట. అంటే చాలా తక్కువే ఉన్నాయని తెలుస్తోంది. ఆయన మొత్తం అప్పు కలిపినా కేవలం ఏడున్నర లక్షలే ఉందట. ఇదే సమయంలో గోరంట్లపై పోటీ చేస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సైతం కేవలం మూడున్నర కోట్ల ఆస్తి మాత్రమే ఉందని అంటున్నారు. ఆయన పేరిట బాండ్లు, డిపాజిట్లు, సేవింగ్స్, కార్లు ఏమీ లేవట.
బ్యాంకులో దాచుకున్న 40 లక్షల నగదుతో పాటు మరో 35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. రూ.2 కోట్ల విలువైన వ్యవసాయ భూమితో పాటు రూ.75 లక్షల విలువైన ప్లాట్లు, మరో రూ.25 లక్షల విలువైన ఇల్లు ఉందట. అలాగే ఆయన అప్పులు సైతం కేవలం రూ.14 లక్షలు మాత్రమే ఉన్నాయని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అయితే.. ఈ ఇద్దరు నాయకులు వ్యూహాత్మకంగా ఇలా ప్రచారం చేసుకుంటున్నారా? సింపతీ కోసం ప్రచారం చేసుకుంటున్నారా? అనే వాదన కూడా వినిపి స్తుండడం గమనార్హం. ఏదేమైనా.. బుచ్చయ్య వర్సెస్ వేణు్ల్లో ఎవరూ పెద్దగా డబ్బులు పంచేందుకు ముందుకు రావడం లేదట. ఈ క్రమంలోనే వారి వారి ఆస్తులు, పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం.