Allu Arjun: ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి కుమర్తె స్నేహ రెడ్డిని ఓ నైట్ క్లబ్ పార్టీ లో అల్లు అర్జున్ తొలిసారి చూశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా తొలి చూపులో స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి మీట్ అయ్యారు. అలా ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది.
కొన్నాళ్లు డేటింగ్ అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అల్లు అర్జున్, స్నేహ రెడ్డి పెళ్లికి మొదట ఇరుకుటుంబాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా స్నేహ తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కూతురి ప్రేమను ఏమాత్రం అంగీకరించలేదు. సినీ నేపథ్యం ఉన్న అబ్బాయిని అల్లుడిని చేసుకోనని ఆయన చెప్పేశారు. అయినా సరే అల్లు అర్జున్ వెనక్కి తగ్గలేదు. ఏది ఏమైనా స్నేహతోనే తన లైఫ్ అని ఫిక్స్ అయ్యారు. ఫైనల్ గా పెద్దలను ఒప్పించి స్నేహ మెడలో మూడు ముళ్లు వేశాడు.
2011 మార్చి 6న హైదరాబాద్ లో అల్లు అర్జున్, స్నేహల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 2014లో వీరికి అయాన్ అనే కుమారుడు, 2016లో అర్హ అనే కూతురు జన్మించారు. అల్లు అర్జున్ తన ఫ్రొఫెషనల్ లైఫ్ కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తాడో.. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఫ్యామిలీకి ఇస్తాడు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా భార్య, పిల్లలతో అల్లు అర్జున్ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. తరచూ ఫ్యామిలీతో వెకేషన్స్ కు వెళ్తుంటాడు.
స్నేహ రెడ్డి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కానప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. అటువంటి స్నేహ రెడ్డి గురించి తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య విడుదలై ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి ఆర్య మూవీ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు.
వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో ఆర్య మూవీని తెరకెక్కించారు. ఈ నేపథ్యంలోనే ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ వేడుకలో స్టేజ్ పై ఉన్న అల్లు అర్జున్ ను `మీ రియల్ లైఫ్ లో వన్ సైడ్ లవ్ గురించి చెప్పండి` అంటూ యాంకర్ ప్రశ్నించింది. అందుకు అల్లు అర్జున్ బదులిస్తూ `స్నేహతో ఇప్పటికీ నాది వన్ సైడ్ లవ్వే. మనం ప్రేమించడం తప్పితే అటు నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండదు` అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ నవ్వుతూనే ఈ వ్యాఖ్యలు చేశాడు. కానీ నెటిజన్లు మాత్రం పెడర్థాలు తీస్తున్నారు. స్నేహారెడ్డికి తన పట్ల ప్రేమ లేదని పరోక్షంగా చెప్పి అందరి ముందు భార్య పరువును అల్లు అర్జున్ తీసేశాడని చర్చించుకుంటున్నారు.