Telangana Ministers: తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖలు కేటాయించే విషయంపై శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి .. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ప్రకటన విడుదల చేశారు.
అయితే కీలక హోంశాఖను సీఎం వద్దనే అట్టి పెట్టుకున్నారు. అలానే పురపాలక, ఎస్సీ,ఎస్సీ సంక్షేమ శాఖలను ఎవరికీ కేటాయించలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి హోం శాఖ కేటాయించారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే.
శాఖల వారిగా వివరాలు
డిప్యూటి ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆర్ధిక, ఇంధన శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, చేనేత, జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్, పర్యావరణం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటి పారుదల, పౌర సరఫరాలు, దామోదర రాజనర్సింహకు వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, పొన్నం ప్రభాకర్ కు రవాణఆ, బీసీ సంక్షేమం, దనసరి అనుసూయ (సీతక్క)కు పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమం, కొండ సురేఖకు అటవీ, పర్యవరణ, దేవాదాయ శాఖ మంత్రిత్వ శాఖలను కేటాయించారు.
మరో ఏడు ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నందున త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కోసం సీటు మారి ఓటమి పాలైన షబ్బీర్ అలీతో పలు నియోజకవర్గాల్లో పోటీ కారణంగా పోటీకి దూరంగా ఉన్న పలువురు సీనియర్ నేతలకు మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడం జరుగుతుందని హామీలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.