జాతీయ రాజకీయాలలో తృణమూల్ కీలకం

జాతీయ రాజకీయాలలో తృణమూల్ కాంగ్రెస్ చాలా కీలకమైన పాత్ర పోషించనుందని ఆ పార్టీ నాయకుడు డెరిక్ ఒబ్రీన్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జాతీయ స్థాయిలో రాజకీయాలు వేడెక్కాయనీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం కొలువుదీరాలన్న విషయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా వ్యవహరించనుందని అన్నారు. అందుకే రాజకీయ పార్టీల నాయకులు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారని అన్నారు.

కేంద్రంలో బీజేపీయేతర కూటమి ఏర్పాటులో మమత అత్యంత కీలకపాత్రపోషించనున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాట్లలో భాగంగా తెలుగుదేశం ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల మమతా బెనర్జీతో భేటీ అయిన విషయం విదితమే. అలాగే తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు ఆమెతో భేటీ అవుతారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే దిశగా బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి ఏర్పాటు భాగంగా కేసీఆర్ నేడు మమతా బెనర్జీని కలువనున్నారు. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.