చిత్రం : ఇస్మార్ట్ శంకర్
నిర్మాణ సంస్థ: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్
నటీనటులు: రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు
ఆర్ట్: జానీ షేక్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మ్యూజిక్: మణిశర్మ
ఫైట్స్: రియల్ సతీష్
ఎడిటింగ్: జునైద్ సిద్ధికీ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
దర్శకత్వం: పూరి జగన్నాథ్
సినిమా ఎంత గొప్పగా చేశామని కాదు.. చివరకు అది సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది ముఖ్యం అని అనుకున్నాడేమో పూరి. పక్కా మాస్, యూత్‌ను టార్గెట్ చేస్తూ `ఇస్మార్ట్ శంకర్` కథను తయారు చేసుకున్నాడు. క్లాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న రామ్‌తో పూరి ఈ సినిమాను అనౌన్స్ చేయడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ఇప్పటి వరకు హీరోలకు మాస్ ఇమేజ్ను ఇచ్చిన పూరి జగన్నాథ్.. రామ్‌ను ఎలా చూపిస్తాడోనని అనుకున్నారు. టీజర్, ట్రైలర్‌తో పూరి రామ్‌ను ఎలా చూపించబోతున్నాడనేది చెప్పేశాడు. పక్కా ఓల్డ్ సిటీ కుర్రాడు శంకర్‌గా రామ్ ఇస్మార్ట్‌గా ఆకట్టుకున్నాడా? లేదా? అని తెలియాలంటే సినిమా కథేంటో చూద్దాం..
కథ:
శంకర్(రామ్) ఓల్డ్ సిటీలో ఓ రౌడీ. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. అలా ఓ డీల్ విషయంలో చాందిని(నభా నటేశ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడతాడు. అదే సందర్భంలో పొలిటీషియన్ కాశీరెడ్డిని హత్య చేసిన కేసులో రామ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ శంకర్ జైలు నుండి తప్పించుకుంటాడు. సైంటిస్ పింకీ(నిధి అగర్వాల్) శంకర్ మెదడులోకి ఓ చిప్‌ను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అసలు పింకీ మరో వ్యక్తి జ్ఞాపకాలను శంకర్ మెదడులోకి ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని చూస్తుంది? శంకర్‌కి, సీబీఐ ఆఫీసర్ అరుణ్(సత్యదేవ్)కి ఉన్న రిలేషన్ ఏంటి? చివరకు శంకర్ తన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే.. రామ్ గురించి ముందుగా చెప్పాలి. ఇప్పటి వరకు లవర్‌బోయ్‌గా, చాక్లెట్‌బోయ్‌గా మెప్పించిన రామ్ తొలిసారి పక్కా మాస్ ఎంటర్టైనర్లో నటించాడు. పక్కా తెలంగాణ ఓల్డ్ సిటీ కుర్రాడిగా రామ్ నటన మరో లెవల్లో కనపడుతుంది. తెలంగాణ యాసలో అన్ని డైలాగులను బాగానే చెప్పాడు. అక్కడక్కడా యాసను పలికే సందర్భంలో వచ్చే ఇబ్బంది కనపడుతుంది. డ్యాన్సులు, యాక్షన్‌లో రామ్ నటన సూపర్బ్. మొత్తంగా చూస్తే పాత్ర పరంగా రామ్ నెక్ట్స్లె లెవల్ హీరో అనిపించేలా నటించాడు. నిధి అగర్వాల్, నభా నటేశ్ గ్లామర్ పరంగా పోటీ పడుతూ నటించారు. యూత్‌కు, మాస్ ఆడియెన్స్‌కు వీరి పాత్రలు కనెక్ట్ అవుతాయి. అలాగే కీలక పాత్రల్లో సత్యదేవ్, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సాధారణంగానే పూరి జగన్నాథ్ హీరోలు మాస్‌గా ఉంటారు. ఈసారి పూరి మరో లెవల్లో ఉండేవారిలా రామ్ పాత్రను డిజైన్ చేశారు. పాత్రను మాస్కు, యూత్‌కు ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. డైలాగ్స్ పక్కా మాసే.అలాగే సినిమాను కమర్షియల్ స్టైల్లో తెరకెక్కించాడు పూరి. మూడు పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది. రాజ్‌తోట సినిమాటోగ్రఫీ బావుంది. ఉండిపో ఉండిపో అనే మెలోడిలో నిధి అందాలను అరబోసింది. అలాగే టైటిల్ సాంగ్.. దిమాక్ ఖరాబ్ సాంగ్స్ అన్నీ యూత్, మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయనడంలో సందేహం లేదు. అలాగే గత చిత్రాల కంటే ఎంగేజింగ్‌గా ఉండేలా సినిమాను తెరకెక్కించారు పూరి.
చివరగా.. ఇస్మార్ట్ శంకర్.. రొటీన్ కమర్షియల్ డ్రామా
రేటింగ్: 2.25/5