తెలుగు వాడు అయినా కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే హర్షివ్ కార్తీక్‌కు సినిమా రంగం అంటే పిచ్చి. సినిమాల్లో హీరో అవ్వాలని.. తెరమీద మెరిసిపోవాలని.. డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే తానే రచయితగా.. నిర్మాతగా.. హీరోగా.. అటు మెగాఫోన్ పట్టేసి డైరెక్టర్‌గా మారిపోయి తెరకెక్కించిన సినిమా బహుముఖం. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
తన్వీర్ ( హర్షివ్ కార్తీక్ ) అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ఫ్యామిలీ కుర్రాడు. వాళ్ల అమ్మకు యాక్టింగ్ అంటే ఇష్టం.. ఆమె యాక్టర్ కాలేకపోతుంది. అయితే తన తల్లి కన్న కలలు నిజం చేసేందుకు తన్వీర్ యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఛాన్సులు రావు. ఓ సారి అనుకోని కేసులో ఇరుక్కుని జైలు శిక్ష కూడా అనుభవించి వస్తాడు. ఆ తర్వాత ఓ సైకో పాత్ర అడిషన్‌కు వెళ్లి చేయలేక విమర్శలకు గురవుతాడు. ఎలాగైనా ఆ పాత్ర చేయాలన్న కసితో నిజంగానే సైకోలా మారిపోయి హత్యలు చేస్తుంటాడు ? అసలు తన్వీర్ ఎందుకు హత్యలు చేయడం మొదలు పెట్టాడు ? అతడు నటుడు అయ్యాడా ? తన తల్లి కోరిక నెరవేర్చాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే హర్షివ్ కు సినిమా మీద ఏ స్థాయిలో ఇంట్రస్ట్, పిచ్చి, ఫ్యాషన్ ఉన్నాయో ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది. బహుముఖ పాత్రలు చేస్తూ సినిమాను ప్రజెంట్ చేసిన తీరుకు నిజంగానే హ్యాట్సాఫ్ చెప్పాలి. అతడే సినిమాకు రచయిత, హీరో, నిర్మాత, దర్శకుడు కావడంతో మంచి పట్టుతో సినిమా తీశాడు. సినిమా ఎక్కువ భాగం అమెరికాలోనే షూట్ చేశారు. దీంతో విజువల్స్‌లో గ్రాండియర్ లుక్ మనకు కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగున్నా కొన్ని చోట్ల సాగదీసినట్టు.. స్లో అయినట్టు ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు.
నటీనుటల పెర్పామెన్స్ :
నటీనటుల పరంగా సినిమా అంతా హర్షివ్ కార్తీక్ మెయిన్ లీడ్ తీసుకుని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తాడు. హీరోయిన్ స్వర్ణిమా సింగ్ కొన్ని సీన్లకే పరిమితం అయినా… అమెరికన్ నటి మరియా మార్టినోవా మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులంతా అమెరికా వాళ్లే కావడంతో పాత్రలకు పరిమితమై న్యాయం చేశారు.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
ఈ సినిమాకు అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ల్యూక్ ఫ్లెచర్ విజువల్స్ చాలా బాగున్నాయి. కథకి తగ్గట్టు అమెరికాని బాగా చూపించారు. శ్రీ చరణ్ పాకాల తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు. తల్లి కలని తీర్చడానికి కొడుకు ఏం చేశాడు అనే సింపుల్ కథ అయినా కొత్తగా చూపించడానికి హర్షివ్ కార్తీక్ ట్రై చేసిన విధానం బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. కథకు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా..
బహుముఖం నటన అంటే పిచ్చి ఉన్న ఓ అబ్బాయి తల్లి కలని నిజం చేయడానికి నటుడిగా మారాలనుకునే క్రమంలో సైకోలా మారితే ఎలా ఉంటుంది అనే థ్రిల్లింగ్ అంశం తో తెరకెక్కించారు.
రేటింగ్ : 2.75/5