Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం హెలికాఫ్టర్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బీహార్ లో పర్యటిస్తున్న ఆయన బెగుసరాయ్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరిగి హెలికాఫ్టర్ లో బయలుదేరినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
హెలికాఫ్టర్ బ్యాలెన్స్ కోల్పోయి దాదాపు నేలకు తాకేలా అటూనిటూ ఊగుతూ కుడి వైపునకు ఒరుగుతూ వెళ్లింది. దీంతో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాఫ్టర్ ను తన ఆధీనంలోకి తెచ్చుకుని ముందుకు నడిపించడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రచారం సాగించారు.
కాగా, హెలికాఫ్టర్ బ్యాలెన్స్ కోల్పోవడానికి కారణాలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. ఈ ఘటనతో బీజేపీ నేతలు ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
గత వారం కూడా అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కిందకు దిగలేకపోయింది. ఈ నెల 21న పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు అమిత్ షా వెళ్లారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాఫ్టర్ ల్యాండింగ్ విఫలమైంది. దీంతో ఆ పర్యటనను ఆయన రద్దు చేసుకోవాల్సి వచ్చింది.