ప్రజల నోళ్లలో పడి నానుడిగా మారిన ఒక విష్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.`రామాయణం అంతా విని.. రాముడికి సీత ఏమవుతుంది.. అన్నట్టుగా ఉంది`!! అనే మాట.ఈ నానుడి మనకు `వ్యక్తి శ్రద్ధ.. బుద్ధి కుశలత`కు పెట్టే పరీక్షే! ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక పుస్తకాన్ని ఏదో చదివామంటే.. చదివాం.. అని కాకుండా.. వాటిని శ్రద్ధగా చదవడం.. లేదా తెలుసుకోవడం.. అలా చదివిన లేదా తెలుసుకున్న విషయాన్ని మన బుద్ధిని వినియోగించి అర్ధం చేసుకోవడం అనే కీలక సూత్రాన్ని రామాయణం ప్రతి ఒక్కరికీ నేర్పుతుంది…
సీతారాముల కళ్యాణం నుంచి తిరిగి ఏకాంతగా, నిండు గర్భిణిగా సీతాదేవి వనవాసానికి వచ్చే వరకు ఉన్న మధ్యకాలంలో కేవలం పదిమాసాల సమయం మాత్రమే.. రాముడి వియోగాన్ని భరించింది. రావణాసురుడు సీతాదేవిని మోహించడం, ఆమెను అపహరించడం, తర్వాత రాముడు హనుమ సాయంతో సీతాదేవి జాడను గుర్తించడం, రామ-రావణ యుద్ధం తెలిసిందే. దీనిని పక్కన పెడితే.. తిరిగి సీతాదేవిని రాముడే స్వయంగా అడవుల్లో విడిచిపెట్టమని సోదరుడైన లక్ష్మణ స్వామిని ఆదేశించేవరకు ఆమె రాముడి వెంటే ఉన్నది.
రాముడి మనసే సీతమ్మ, సీతమ్మ మనసే రామయ్యగా జీవితాలను పంచుకున్నారు. ఈ జగత్తుకే ఆదర్శంగా నిలిచారు. సీత అపహరణకు గురైన విషయం తెలియడంతో “రామో దాశరధి శ్శూరో..“ అంటూ కీర్తిపొంది.. మారీచ, సుబాహుల వంటి భయంకరమైన రాక్షసులను తరిమికొట్టి, తాటక వధ చేసిన రాముడు.. బిక్కటిల్లిపోయి.. కన్నీరు పెట్టినా, పదిమాసాల పాటు పరాయి రాజ్యంలో ఉన్నప్పటికీ.. సీతమ్మపై ఇసుమంతైనా సందేహం లేకపోవడం వెనుక.. రాముడి మనసులో సీత స్థానం.. అవగతం అవుతుంది.
సూటిపోటి మాటలతో వేధించే రాక్షస స్త్రీలు ఒకవైపు, రాముడిని కించపరుస్తూ.. తూలనాడే రావణాసురుడు మరోవైపు తన మనసును ఛిద్రం చేస్తున్నా.. రాముడు ఉన్నాడో లేడో.. వస్తాడో.. రాడో అని సందేహించక.. తన రాముడు తప్పకుండా వచ్చితీరుతాడని భావించిన సీతమ్మ మనసులో రాముడి స్థానం చెప్పకనే చెబుతుంది రామాయణం. అందుకే రామాయణం పూర్తిగా చదివి సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే.. రాముడి మనసు.. సీతదగ్గర.. సీత మనసు రాముడి దగ్గర ఉన్నదనే విషయం అర్ధమవుతుంది. అంటే.. ఆ ఇద్దరూ వేరు కాదు.. ఒక్కరే! తనువులు వేరైనా.. వారిరువురూ ఒక్కరే అనే అర్ధం తెలుస్తుంది. ఇది చెప్పడానికే మనవాళ్లు.. రాముడికి సీత ఏమవుతుంది? అనే నానుడి వాడతారు. ఏదైనా విషయం అంతా విని కూడా అర్ధంకానట్టు మొహం పెట్టేవారి విషయంలో ఇలాంటి నానుడులు వాడడం మనకు కనిపిస్తూనే ఉంటుంది.