Satyabhama Movie: వివాహం అయిన తర్వాత కూడా హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకటి. గత ఏడాది భగవంత్ కేసరి మూవీతో సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం సత్యభామ అనే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఔరం ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క మరియు శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మించారు. గూఢచారి, మేజర్ లాంటి అద్భుతమైన సినిమా తీసిన డైరెక్టర్ శశికిరణ్ తిక్క సత్యభామ మూవీకి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథనం కూడా అందించారు.
అలాగే ఇందులో టైటిల్ పాత్రను కాజల్ పోషించగా.. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. నిజానికి సత్యభామ సినిమా మే 17వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మే 31వ తేదీకి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. అయితే తాజాగా మరోసారి సత్యభామ విడుదల వాయిదా పడింది. తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. జూన్ 7న సత్యభామ థియేటర్లలోకి రాబోతున్నట్లు నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను బయటకు వదిలారు.
సత్యభామ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేసింది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు కాజల్ గత వారం పది రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది. అలాగే బుల్లితెరపై టీవీ షోస్‌లో పాల్గొంటూ సత్యభామను జనాల్లోకి తీసుకెళ్తోంది.
మే 24న హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో సాయంత్రం 6.30 గంటల నుండి సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు. బాలయ్య చేతుల మీదగా సత్యభామ ట్రైలర్ రిలీజ్ కానుందని చిత్రటీమ్ ఇప్పటికే ప్రకటన చేసింది. దీంతో ఈ ఈవెంట్ కోసం కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ తో పాటు బాలయ్య అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
కాగా ఈ నెల 31న థియేటర్స్ లో సందడి చేసేందుకు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కాజల్ అగర్వాల్ సత్యభామ, సుధీర్ బాబు నటించిన హరోం హరతో సహా మొత్తం ఆరు సినిమాలు క్యూ కట్టాయి. కానీ ఏమైందో ఏమో గానీ ఒక్కో సినిమా ఆ తేదీ నుంచి తప్పుకుంటోంది. ఆల్రెడీ సుధీర్ బాబు యొక్క హరోం హర మూవీ జూన్ 14కు షిఫ్ట్ అయింది. తాజాగా సత్యభామ సినిమాను కూడా జూన్ 7వ తేదీకి పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు అందరి చూపులు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపైనే ఉన్నాయి.