Rajinikanth: చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే మహానటి సావిత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఇండియన్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, అమరవీరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తో సహ ఎందరో ప్రముఖుల బయోపిక్స్ వెండితెర పైకి వచ్చాయి. అయితే త్వరలో సీనియర్ హీరో, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కూడా రాబోతోంది. రజనీకాంత్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. బెంగళూరులోని ఒక మధ్య తరగతి మరాఠీ కుటుంబంలో శివాజీ రావు గైక్వాడ్ గా జన్మించిన ఆయన.. బస్సు కండక్టర్ గా కెరీర్ ప్రారంభించారు.
ఆ తర్వాత రజనీకాంత్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నటుడిగా మారారు. ఎన్నో కష్టాలు సవాళ్లు దాటుకుని కోట్లాది మంది ప్రేక్షకులు అభిమానించే ఆరాధించే సూపర్ స్టార్ గా ఎదిగారు. దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేట్టుగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఏడు పదుల వయసులోనూ హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రైటర్ సాజిద్ నడియాడ్వాలా రజనీకాంత్ బయోపిక్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కాంట్రాక్టుపై రజనీకాంత్ తో ఇటీవలె సాజిద్ సైన్ చేయించుకున్నారట. స్వతాహాగా రజనీకాంత్ కు సాజిద్ నడియాడ్వాలా అభిమాని. అందుకే సాధారణ కండెక్టర్ నుండి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ జీవిత కథను ప్రపంచం మొత్తం చూడాలని సాజిద్ నడియాడ్వాలా ఆశపడుతున్నారు. ఇందులో భాగంగానే రజనీకాంత్ బయోపిక్ హక్కులను తీసుకున్న సాజిద్.. స్క్రిప్ట్ పనులు కూడా షురూ చేసినట్లు తెలుస్తోంది.
రజనీకాంత్ బయోపిక్ ను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించేందుకు సాజిద్ ప్రణాళికలు రచిస్తున్నారు. రజనీకాంత్ సినీ జీవితాన్నే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను బయెపిక్‌లో టచ్ చేయబోతున్నారని సమాచారం. ఈ మూవీ షూటింగ్ 2025లో ప్రారంభమవుతుందని కూడా అంటున్నారు. ఇకపోతే రజనీకాంత్ బయోపిక్ లో సూపర్ స్టార్ గా నటించే హీరో ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదే తరుణంలో ఓ హీరో పేరు తెరపైకి వచ్చింది. రజనీకాంత్ మాజీ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ సూపర్ స్టార్ గా నటించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ధనుష్ అయితే మామ పాత్రకి న్యాయం చేయగలరని అంటున్నారు. పర్సనాలిటీ పరంగా ధనుష్ రజనీకాంత్ పాత్రకు సెట్ అవుతారా అన్న డౌట్ కూడా ఉంది. ఏదేమైనా రాజనీకాంత్ క్యారెక్టర్ ను చేయడం అంత సులభం కాదు. ఆయన స్టైయిల్, మ్యానరిజాన్ని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయగలగాలి. అందులో ఏమాత్రం తేడా వచ్చినా రిజల్ట్ మరోలా ఉంటుదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రజనీకాంత్ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వెట్టైయిన్ అనే సినిమా చేస్తున్నారు. రజనీ కెరీర్ లో 170వ సినిమా ఇది. అలాగే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో కూలీ అనే మూవీ చేసేందుకు కూడా రజనీకాంత్ కమిట్ అయ్యారు.