ఛత్తీస్ గఢ్ సీఎం రాజీనామా

ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ రాజీనామా చేశారు. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన 15ఏళ్ల పాటు ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ణతలు చెప్పారు. ఇక ముందు కూడా రాష్ట్ర ప్రజలకు తన సేవలందిస్తానన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పిన ఆయన ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ కు అభినందనలు తెలిపారు. ఛత్తీస్ గఢ్ లో మొత్తం 90 స్థానాలు ఉండగా వాటిలో కాంగ్రెస్ 65 స్థానాలను కైవసం చేసుకుంది, బీజేపీ 16స్థానాలలో విజయం సాధించింది. జేసీసీ 8 స్ధానాలలోనూ, ఇతరులు 1 స్ధానంలోనూ  గెలుపొందారు. ఛత్తీస్ గఢ్ ఎన్నికలలో విజయంతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ ఎన్నికలలో జేసీసీ ప్రభావం కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుందన్న అంచానాలు తప్పని తేలిపోయింది. సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టనుంది.