మీ దగ్గర రూ.4 లక్షలు ఉంటే ఏం చేస్తారు ? దాంతో ఖరీదైన కారు కొనవచ్చు. ఎక్కడికైనా వెకేషన్ వెళ్లవచ్చు. అవును కదా.. ఇంకా ఎవరికి నచ్చిన పనిని వారు ఆ మొత్తంతో చేయవచ్చు. అయితే ఆ వ్యక్తి మాత్రం ఆ మొత్తం పెట్టి చిన్న మొక్కను కొన్నాడు. అవును నిజమే. ఆ మొక్కకు కేవలం నాలుగు ఆకులు మాత్రమే ఉన్నాయి. అలాగే చిన్నగా కూడా ఉంది. కానీ దాన్ని అంత భారీ మొత్తం చెల్లించి అతను కొనుగోలు చేశాడు.
న్యూజిలాండ్‌లో తాజాగా variegated rhaphidophora tetrasperma అనే అరుదైన జాతికి చెందిన ఓ మొక్కకు ఓ వెబ్సైట్లో వేలం నిర్వహించారు. ఈ మొక్కను Philodendron Minima అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత అరుదైన జాతికి చెందిన మొక్క. దీని పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. అయితే ఇంతకు మించి ఇందులో ప్రత్యేకత ఏముందో తెలియదు కానీ.. దీన్ని వేలంలో ఓ వ్యక్తి ఏకంగా 8150 న్యూజిలాండ్ డాలర్లకు పాట పాడాడు. అంటే మన కరెన్సీలో ఆ మొత్తం దాదాపుగా రూ.4 లక్షలు.
కాగా ఈ మొక్కకు చెందిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రం తాను ఒక చిన్నపాటి ప్యారడైజ్ ఐల్యాండ్‌ను నిర్మించాలనుకుంటున్నానని, అందుకనే దీన్ని కొనుగోలు చేశానని చెప్పాడు. అయితే ఇంత చిన్న మొక్కకు అంత భారీ మొత్తం చెల్లించడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయినా అతనిష్టం. అందుకు ఎవరూ ఏమీ చేయలేరు కదా..!