మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ మాదాపూర్ లోని శరణి నివాసంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మనీ రూటింగ్ కు పాల్పడి రాజధాని అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గతంలో గుర్తించారు. దాదాపుగా 146 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

మాజీ మంత్రి నారాయణపై పలు కేసులు నమోదు అయి ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి అసైన్డ్ భూములు కొనుగోలుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో అవకతవకల కేసు ఉంది. మరో పక్క టెన్త్ క్లాస్ పరీక్షా పత్రాల లీకేజీ కేసు కూడా ఉంది. కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి లోని ఇళ్లలోనూ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అమరావతి భూముల కొనుగోలు అంశంలోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నా పలు కేసులు ఉండటంతో ప్రస్తుతం సీఐడీ అధికారులు ఏ కేసులో ఆయన కుమార్తె నివాసంలో సోదాలు చేస్తున్నారు అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. సోదాల అనంతరం ఏపీ సీఐడీ అధికారికంగా తనిఖీల విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
