ఏపి సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబంబించే పండుగ సంక్రాంతి అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని అకాంక్షించారు. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్కును తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లువిరియాలన్నారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వాహనాల రద్దీ నెలకొంది. కార్లు, ఇతర వాహనాలు చీమల దండుగా సాగడంతో టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీతో కిలో మీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందేల నిర్వహణకు బరులు సిద్దమైయ్యాయి.