కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే !

కార్తీకం.. శివకేశవులకు ప్రీతికరమైన రోజు. ఈమాసంలో ప్రతీరోజు ఒక విశిష్టమైనది. అందులోనూ కార్తీకపౌర్ణమి చాలా విశేషమైనది.

కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి. ఇందులో భాగంగా మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభి షేకాలను చేయించినట్లయితే కోటిజన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుం దని విశ్వాసం. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు.
పురాణగాథ ఇదే !

మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురు ని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం.