Kajal Aggarwal-Payal Rajput: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం సత్యభామ. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఔరం ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క మరియు శ్రీనివాస్ రావు తక్కల ఈ సినిమాను నిర్మించారు. మే 31న సత్యభామ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల జూన్ 7వ తేదీకి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే సత్యభామ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇటీవల బయటికి వచ్చిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ అలరించబోతోంది. హైదరాబాద్ నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును కాజల్ అగర్వాల్ ఎలా చేధించి అనే కథాంశంతో సత్యభామ మూవీని రూపొందించారు. నటన పరంగానే కాకుండా యాక్షన్ సీక్వెన్సెస్ లలో కూడా కాజల్ చెలరేగిపోయిందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. దీంతో సత్యభామ కోసం కాజల్ అభిమానులే కాకుండా సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఇలాంటి తరుణంలో కాజల్ అగర్వాల్ తో బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ బాక్సాఫీస్ పోటీకి సై అంటోంది. మంగళవారం మూవీతో ఇటీవల క్రేజీ హిట్ ను ఖాతాలో వేసుకున్న పాయల్.. త్వరలోనే `రక్షణ` అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రణదీప్ ఠాకోర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.
ఇందులో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పాయల్ రాజ్‌పుత్ నటించింది. రోషన్, మానస్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇటీవల బయటకు వచ్చిన రక్షణ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయబోతున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఒకే రోజు ఒకే జోనర్ కథలతో కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మరి పెద్ద రిస్క్ తీసుకున్న ఈ ఇద్దరు భామల్లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.
కాగా, సత్యభామ మూవీని కాజల్ అగర్వాల్ పర్సనల్‌గా తీసుకుని గట్టిగా ప్రమోట్ చేస్తోంది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై భారీ హైప్ పెంచుతుంది. మరోవైపు పాయల్ రాజ్‌పుత్ మాత్రం రక్షణ ప్రమోషన్స్ కు దూరంగా ఉంది. తనకు ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని, ప్రమోషన్స్ కి రావాలని బెదిరిస్తున్నారని, టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నారని ఇటీవల రక్షణ నిర్మాతలపై పాయల్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్‌పై ప్రొడ్యూసర్స్ కూడా స్పందించారు. పాయల్ ప్రమోషన్స్ కి రాకుండా ఇలా తమపై అసత్య ఆరోపణలు చేస్తుందని వాధించారు. అయితే ఇంత వరకు ఎవరి వైపు నిజం ఉన్నదన్నది మాత్రం తేలలేదు.