Satyabhama: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం సత్యభామ. ఇన్నాళ్లు కమర్షియల్ చిత్రాల్లో అలరించిన కాజల్.. ఇప్పుడు రూటు మార్చింది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. గూఢచారి, మేజర్ లాంటి అద్భుతమైన సినిమా తీసిన శశికిరణ్ తిక్క కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న సత్యభామ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా టైటిల్ పాత్రను పోషించింది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
ఔరం ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క మరియు శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మించిన సత్యభామ మూవీకి సుమన్ చిక్కాల డైరెక్టర్ గా వ్యవహరించాడు. మే 31వ ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల జూన్ 7వ తేదీకి రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లాయి.
శుక్రవారం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చి క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ ట్రైలర్ ను స్వయంగా లాంఛ్ చేశారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన దక్కించుకుంది. ఓ క్రైమ్ మిస్టరీ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే సత్యభామ. హైదరాబాద్ నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును పోలీస్ ఆఫీసర్ గా కాజల్ అగర్వాల్ ఎలా పరిష్కరించింది అనే కథాంశంతో సినిమాను రూపొందించారు.
సత్యభామ పాత్రలో కాజల్ విశ్వరూపం చూపించబోతోందని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఆమె చెలరేగిపోయింది. పెళ్లై ఒక బిడ్డ పుట్టిన వెంటనే ఇటువంటి ఛాలెంజింగ్ రోల్‌ను చేయడం అంత సులభం కానే కాదు. అయినప్పటికీ కాజల్ సవాలుగా తీసుకుని నటించింది. ఇక తన కష్టానికి తగ్గట్లుగానే కాజల్ ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు వరకు కాజల్ ఒక్కో సినిమాకు రూ. 2 నుంచి 2.5 కోట్ల వరకు పారితోషికం అందుకునేది.
అయితే సత్యభామ మూవీ కోసం కాజల్ ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందట. ఇది ఆమె కెరీర్ లోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని గట్టిగా టాక్ నడుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ కాబట్టి ఆ రేంజ్ లో తీసుకోవడం ఏమాత్రం తప్పు కాదని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సత్యభామ కోసం కాజల్ ఎంత కష్టపడిందో ట్రైలర్ ద్వారానే తెలుస్తుందని అంటున్నారు. మరి సత్యభామ కాజల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.