Kajal Aggarwal: గత వారం రోజుల నుంచి అటు ప్రధాన మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఎంతలా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన రాబోయే చిత్రం సత్యభామ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాలో టైటిల్ పాత్రను కాజల్ అగర్వాల్ పోషించింది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఔరం ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క మరియు శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మించిన సత్యభామ మూవీ మే 31న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా విజయం కాజల్ కెరీర్ కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే కాజల్ సత్యభామ చిత్రాన్ని తెగ ప్రమోట్ చేస్తోంది వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొనడమే కాకుండా బుల్లితెరపై టీవీ షోలో సందడి చేస్తూ అభిమనులను, ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో కాజల్ అగర్వాల్ సత్యభామ మూవీ విశేషాలతో పాటు మరెన్నో పర్సనల్ విషయాలను పంచుకుంటోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను నటించిన తెలుగు చిత్రాల్లో తన టాప్ 3 ఫేవరెట్ మూవీస్ ఏవేవో కాజల్ రివీల్ చేసింది. తన కెరీర్ లో బ్రహ్మోత్సవం సినిమా అంటే చాలా చాలా ఇష్టమని చెప్పి కాజల్ అగర్వాల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బ్రహ్మోత్సవం బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాలో కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. జయసుధ, రావు రమేష్, రేవతి, జయప్రకాశ్ రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
భారీ అంచనాల నడుమ 2016 మే 20న విడుదలైన బ్రహ్మోత్సవం తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. కనీసం మహేష్ అభిమానులను అయినా మెప్పించలేకపోయింది. ఫుల్ రన్ లో భారీ నష్టాలను మిగిల్చింది. అటువంటి బ్రహ్మోత్సవం మూవీ తన మోస్ట్ ఫేవరెట్ అని తాజాగా కాజల్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ సినిమాలో కాజల్ ది ఫుల్ లెంగ్త్ రోల్ కూడా కాదు. అయినప్పటికీ అదే తనకు ఇష్టమైన సినిమా అని చందమామ అంటోంది. అందుకు కారణమేంటో కూడా వివరించింది.
బ్రహ్మోత్సవంలో నా క్యారెక్టర్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుందని.. తన రియల్ మెంటాలిటీ ఎలా ఉంటుందో సినిమాలో నా పాత్ర కూడా అలా ఉంటుందని కాజల్ పేర్కొంది. అందుకే బ్రహ్మోత్సవం మూవీ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. అలాగే బ్రహ్మోత్సవం తర్వాత తేజ దర్శకత్వంలో తాను నటించిన సీత సినిమా మరియు త్వరలోనే విడుదల కాబోతున్న సత్యభామ తన మోస్ట్ ఫేవరెట్ మూవీస్‌గా కాజల్ వెల్లడించింది. ఇక టాలీవుడ్ లో ఫేవరెట్ హీరోలు ఎవరని ప్రశ్నించగా.. కాజల్ క్షణం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు చెప్పింది. హీరోయిన్లలో సమంత అంటే ఇష్టమని తెలిపింది.