1500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అమరావతి, జనవరి4 : జనవరి నెలాఖరులోగా 1500 ఉద్యోగాల భర్తీకి మరో 14 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్  ఉదయ్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం భాస్కర్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గత ఏడాది డిసెంబరు 31లోగా  నోటిఫికేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 21 నోటిఫికేషన్ల ద్వారా 3250 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు వివరించారు.

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 47,001 దరఖాస్తులు, ఫారెస్టు రేంజ్ అధికారి ఉద్యోగాలకు 16,130, అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు 5411, హార్టీ కల్చర్ ఉద్యోగాలకు 1307 దరఖాస్తులు అందాయని తెలిపారు. పంచాయితీ కార్యదర్శుల ఉద్యోగాలకు ఈనెల 19 వరకు దరఖాస్తులకు గడువు ఉందనీ, ఈ పోస్టులకు 56,621 దరఖాస్తులు అందాయని చెప్పారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు.