బ్యాంకులపై క‌రోనా దెబ్బ‌.. ఆర్బీఐ హెచ్చ‌రిక !

ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సృష్టించిన సంక్షోభం అంతాఇంతా కాదు. ఇప్ప‌టికే సామాన్యుల మొద‌లు అంద‌రూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక బ్యాంకుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే మొండిబ‌కాల‌యిలు, రుణాలు తీసుకున్నవారు వాటిని మోసగించి ఇత‌ర దేశాల‌కు పారిపోవ‌డంతో వంటి అంశాలతో బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

అయితే, తాజాగా భార‌త రిజ‌ర్వు బ్యాంక్ విడుద‌ల చేసిన ఓ నివేదిక దేశంలోని ఇత‌ర జాతీయ బ్యాంకుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. దీంతో ఆయా బ్యాంకులు అప్ర‌మత్త‌మై.. చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మిస్తున్నాయి. అంత‌లా బ్యాంకులు ఆందోళ‌న చెందాల్సిన అంశాలు ఆర్బీఐ నివేదిక‌లు ఏమున్నాయి అనుకుంటున్నారా? అదేనండి బ్యాంకులు ఇచ్చే రుణాలు ! క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో త‌లెత్తిన ప‌రిస్థితుల కార‌ణంగా అధిక మొత్తంలో క్రెడిట్ కార్డు రుణాల‌పై భారం ప‌డ‌నుంద‌ని ఆర్బీఐ త‌న నివేదిక‌లో హెచ్చ‌రించింది.

ఈ క్రెడిట్ కార్డుల రుణ‌భారం దాదాపు రూ. ల‌క్ష కోట్ల‌వ‌ర‌కూ ఉంటుంద‌ని ఆర్బీఐ నివేదిక అంచ‌నా వేసింది. ఇప్ప‌టికే క్రెడిట్ కార్డుల బాకాయిలు అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయ‌నీ, దీనికి క‌రోనా మ‌హమ్మారి నేప‌థ్యంలో ప్ర‌భుత్వం విధించిన ఆరు నెల‌ల మ‌రిటోరియం ఆగస్టు నెల‌తో ముగియ‌డం కూడా ఓ కార‌ణంగా పేర్కొంది. ఈ నేప‌థ్యంలో అప్ర‌మత్త‌మైన క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థ‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే రుణాలు అంద‌జేసిన వారి వివ‌రాలు ప‌రిశీలించ‌గా.. వాటిలో స‌గానికిపైగా రిస్క్ జోన్‌లో ఉన్న‌ట్టు గుర్తించ‌డం గ‌మ‌నార్హం.

2020-21 ఆర్థిక ఏడాదిలో తొలి ఐదు నెలల్లో ఈ వ్యాపార వృద్ధిరేటు -3శాతంగా ఉంద‌నీ, అదే సమయంలో రావాల్సిన బకాయిలు రూ.1.04లక్షల కోట్లు ఉన్నాయి. గతేడాది ఇదే సమయంలో వృద్ధిరేటు 10-30 శాతం వ‌ర‌కూ ఉన్నాయి. అయితే, ప్ర‌స్తుతం రుణాల ఎగ‌వేత‌లు పెర‌గ‌డంలో వృద్ధిరేటు మైన‌స్‌కు ప‌డిపోయింది. దీనికి క‌రోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభ‌మే కార‌ణంగా తెల‌సుస్తోంది. ఉద్యోగాలు కోల్పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణం. ఈ నేప‌థ్యంలో ప్రొవిజ‌న్లు ఏర్పాటు చేసుకోవాల‌ని ఆర్బీఐ బ్యాంకుల‌కు సూచిస్తోంది.