ఇది ఆలీ దౌత్యమా?

అమరావతి, జనవరి 6: రాజకీయాల్లోకి కాలుమోపుతున్నాడన్న ఊహాగానాల మధ్య ప్రముఖ హస్య నటుడు ఆలీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఆయనను కలిసి ఏకాంతంగా అరగంట పాటు మాట్లాడారు. ఈ రోజు ఉదయం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన విషయం తెలిసిందే.

జనసేనాని పవన్‌ను కలిసిన కొద్ది గంటల వ్యవధిలోనే ఆలీ ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. ఒకే రోజు రెండు పార్టీల అధినేతలతో ఏకాంత చర్చలు జరపడం, మీడియాతో ఏమీ మాట్లడకుండా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలకు దారి తీసింది.

క్రియాశీల రాజకీయాలో ప్రవేశించి రాబోయే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుండి పోటీ చేయాలని కూడా ఆలీ ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇంతలో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ముగింపు నాడు ఆలీ వైసీపీలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. ఈ నేపధ్యంలో ఆదివారం ఆలీ పవన్‌ను కలవడంతో తాను గురువుగా, మార్గదర్శకుడుగా భావించే పవన్‌ కల్యాణ్‌తోనే ఆలీ రాజకీయ ప్రయాణం చేస్తారని జనసేన కార్యకర్తలు భావించారు.

అయితే కొద్ది గంటలలోనే విషయం మారింది. ఆలీ వెళ్లి ముఖ్యమంత్రిని కూడా కలిశారు. ఆలీ వారిద్దరినీ వ్యక్తిగత కారణాలతో కలిశారా, లేక రాజకీయ కారణం ఏమన్నా ఉందా అన్న ఊహగానాలు షికారు చేస్తున్నాయి. మొన్న చంద్రబాబు విలేఖరులతో, ‘ఏం జనసేనతో కలిసి పనిచేస్తే తప్పేంటి? పవన్ కూడా బిజెపిని వ్యతిరేకిస్తున్నారుగా!’ అన్న విషయం తెలిసిందే. ఆయన ఆ  మాట అన్నమీదట టిడిపి, జనసేన ఎన్నికలలో కలిసి వెళతాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వైఎస్‌ఆర్‌సిపి ఆ కోణంలో విమర్శలు కూడా ప్రారంభించింది. మరుసటి రోజు పవన్ కళ్యాణ్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఊహాగానాలకు తెర దించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ మధ్య రాజకీయ సయోధ్యకు ఆలీ ప్రయత్నాలేమన్నా చేస్తున్నారా అన్న ఊగాహానాలు కూడా వినబడుతున్నాయి