హైదరాబాద్ : తప్పుడు పనులు చేసి పోలీసుల నుండి తప్పించుకోవడం అంత సులువు కాదు. తాడి తన్నే వాడు ఉంటే వాడి తలతన్నే వాడు ఉంటాడు అన్న సామెత ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా నంటే….తన తెలివి తేటలతో పోలీసులను బురిడీ కొట్టించాలనుకున్న ఓ ప్రబుద్దుడు అడ్డంగా దొరికి పోయాడు.
తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలు ఒకింత కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగిస్తున్న కొందరు చలానా భాదలు తప్పించుకొనే ప్రయత్నంలో తప్పుడు మార్గాలను ఎంచుకోవడం కనబడుతోంది. నెంబర్ ప్లేట్ సరిగ్గా కనిపించ కుండా ఒక నంబర్ ను తొలగించడం, ఏదైనా అడ్డుపెట్టడం లాంటివి గతంలో చూసాం. అయితే ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధన తీసుకొచ్చారు. నెంబర్ ప్లేట్ పై ఎలాంటి స్టికర్ లు అతికించిన, ఏదైనా అడ్డుపెట్టినా శిక్షర్హులు అని, కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. అలా చేసే వారి పై కఠినంగా వ్యవహరించాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
సైఫాబాద్ లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా లకడికపుల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా..హోండా డియోకి నంబర్ ప్లేట్ చివరి అంకె కనబడకుండా, బబుల్ గం అతికించిన ఒ యువకుడు దొరికిపోయాడు. పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు ఆ ప్రబుద్దుడిపై కేసు బుక్ చేశారు. అయితే ఈ నేరానికి పాల్పడింది ఏమి తెలియని అమాయకుడు కాదు, జిన్నారంకు చెందిన ఒక మెకానిక్ అని పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసుల వద్ద ఎలాంటి వేషాలు వేస్తే దొరికిపోరా మరి? వాహన చోదకులు జర జాగ్రత్త!