ఏపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవేళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. వరదల కారణంగా డయాఫ్రం వాల్ 485 మీటర్ల మేర దెబ్బతిన్నదని, పెద్ద గుంతలు ఏర్పడ్డాయని వీటిని సరిచేస్తేనే మిగతా పనులు ముందుకు సాగుతాయని ఆయన అన్నారు. ఈ మరమ్మత్తు పనులకే రూ.2వేల కోట్లు అవసరమని స్పష్టం చేశారు. ఈ సీజన్ లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని తెలిపిన మంత్రి అంబటి .. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని మరో సారి పేర్కొన్నారు.

పోలవరంపై తాను ఏమీ రాజకీయ ఆరోపణలు చేయడం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉనప్పుడు అవగాహన రాహిత్యం, ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలన్న తాపత్రయంతోనో కాపర్ డ్యామ్ లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ వేయడం వల్ల ఇంత అనర్ధం జరిగిందని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనన్నారు. దీనిపై నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ అధ్యయనం చేసిందని, ఇటీవలే నివేదిక కూడా వచ్చిందన్నారు. చర్యల సంగతి ప్రాజెక్టు పూర్తైన తర్వాతేనని చెప్పారు. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమే కాదనీ, నిపుణులు చెబుతున్న మాట అని మంత్రి అంబటి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్ చేసి ముందకు వెళ్లాల్సి ఉంటుందనీ, ఏ విధంగా రిపేరు చేయాలో అధికారులు పరిశీలిస్తున్నారన్నారు.
పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని అన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్ లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొందరపాటు, డెడ్ లైన్ లు ఎందుకని ప్రశ్నించారు. వేళ ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రతిప్టాత్మక ప్రాజెక్టు ఇది అని, అందుకే పనులు కాస్త ఆలస్యమైనా నాణ్యతగా ఉండాలన్నదే తమ అభిమతమని అంబటి తెలిపారు. వైఎస్ఆర్ కలలు కన్న ప్రాజెక్టు ఇది అని, సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని మంత్రి అంబటి ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నది త్వరలో నిర్ణయిస్తామని ఆయన స్పష్టం చేశారు.