Guntur Rave Party: గుంటూరులో కలకలం రేపిన రేవ్ పార్టీ ఉదంతంలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్బన్ సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్ లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడంతో పాటు విజయవాడ నుండి పిలిపించిన ఆరుగురు యువతులతో కొందరు అసభ్య నృత్యాలు చేశారు.
రెస్టారెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం అందడంతో గుంటూరు పట్టాభిపురం పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అక్కడ పార్టీలో ఉన్న 25 మందిని అదుపులోకి తీసుకుని వారిపై వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. అయితే ఇటువంటి వాటిని నిరోధించాల్సిన ఓ పోలీస్ అధికారి ఆ పార్టీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ పార్టీలో పాలుపంచుకున్న సీసీఎస్ సీఐ వెంకటేశ్వరరావుపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు.
ఈ పార్టీలో పాల్గొన్న వారిలో పోలీసుల పిల్లలు, ప్రముఖుల తనయులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖుల పిల్లలు ఈ పార్టీలో ఉండటం వల్ల పోలీసులు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయకుండా లాబీయింగ్ చేశారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. పార్టీలో ప్రముఖుల పిల్లలు ఉన్నా వారిపైనా కేసులు నమోదు చేశామని వెల్లడిస్తున్నారు.