Panchalingala (Kurnool): అక్రమ మద్యం రవాణా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా అక్రమార్కులు మాత్రం పొరుగు రాష్ట్రాల నుండి మద్యం బాటిళ్లను తీసుకువచ్చి ఏపిలోని పలు ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తూనే ఉన్నారు. ఏపిని ప్రభుత్వ మద్యం షాపుల్లో మందుబాబులకు అవసరమైన బ్రాండ్ లు లబించకపోవడం, పొరుగు రాష్ట్రాల ధరలతో పోలిస్తే ఎక్కువగా ఉండటంతో సరిహద్దు ప్రాంతాల వారు తెలంగాణ నుండి మద్యం తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పలువురు మద్యం బాటిళ్లతో పట్టుబడుతున్నారు.

కర్నూలు రూరల్ మండలం పంచలింగాల చెక్ పోస్టు వద్ద స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లాలోకి మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు పట్టుబడ్డారు. నగరంలోని శరీఫ్ నగర్ కు చెందిన నందెపోగు రాజు, బోయ అనందుమార్లు బైక్ పై 30 మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బైక్, మద్యం బాటిళ్లను సీజ్ చేసి ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సెబ్ సీఐ శేషాచలం తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు జిలానీ బాషా, రాముడు, కానిస్టేబుళ్లు పాల్లొన్నారు.