YV Subba Reddy TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా రెండు పర్యాయాలు అంటే దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించిన సీనియర్ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం 8వ తేదీ (మంగళవారం) తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో సోమవారం వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన చివరి పాలకవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని తాజాగా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో జన్మించిన వైవీ సుబ్బారెడ్డి రాజకీయాల్లోకి రాకముందు విద్యుత్ ఉత్పత్తి రంగ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలతో వ్యాపార వేత్తగా ఉండేవారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి వైవీ సుబ్బారెడ్డి తోడల్లుడు. వైఎస్ఆర్ మరణానంతరం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో క్రియాశీల భూమికను పోషించిన వైవీ సుబ్బారెడ్డి .. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుండి వైసీపీ తరపున లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, జగన్మోహనరెడ్డి పాదయాత్రలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్ పై పార్టీ నిర్ణయం మేరకు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

2019 ఎన్నికల్లోనూ ఒంగోలు పార్లమెంట్ కు పోటీ చేయాలని భావించినప్పటికీ టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోసం తన సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ కు వెళ్లాలని భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో జగన్మోహనరెడ్డి .. వైవీకి అవకాశం కల్పించలేదు. ఆ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు సీఎం వైఎస్ జగన్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకు అంటూ ప్రత్యేకంగా అనుచరగణం, అభిమానులు ఉండటంతో ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగాలని వైవీ భావించారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన టీటీడీకి సమర్ధవంతమైన నాయకుడు చైర్మన్ గా ఉంటేనే ప్రభుత్వానికి చెడు పేరు రాకుండా ఉంటుందని, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉంటుందని భావించి సీఎం జగన్ .. వైవీ సుబ్బారెడ్డిని ఒత్తిడి చేసి ఒప్పించారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా నియమితులైన వెంటనే సీఎం జగన్ కు దగ్గర బంధువు కావడంతో .. వైవీ సుబ్బారెడ్డి కూడా క్రైస్తవుడు అని, క్రైస్తవుడికి హిందూ దేవాలయ చైర్మన్ పదవి ఇవ్వడం ఏమిటంటూ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డి కుటుంబ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరస్వామి. వైవీ కుటుంబం మొదటి నుండి హిందువుగా దైవారాధన చేస్తుండేవారు. అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు వెళ్లి వస్తుండే వారు. తనపై జరుగుతున్నది అంతా అసభ్య ప్రచారమనీ, తాను హిందువునేనని నాడు వైవీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

టీటీడీ చైర్మన్ గా విధి నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పని చేశారు. దివాలా అంచున ఉన్న ప్రైవేటు బ్యాంకుల్లోని స్వామి వారి డిపాజిట్ల ను సరైన సమయంలో వెనక్కుతీసుకువచ్చి స్వామి వారి ఆస్తులను కాపాడారు. సాధారణ భక్తులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. రాజకీయ పరంగా వచ్చే విమర్శలను పట్టించుకోకుండా తన దైన ఫందాలో ముందుకు వెళ్లారు. టీటీడీలో ఎటువంటి వివాదాలు లేకుండా సక్రమంగా పరిపాలన సాగిపోతుండటంతో సీఎం జగన్ రెండో దఫా కూడా అవకాశం కల్పించారు. వైవీ తన హయాంలో ఒకే సారి కొండపై ఉన్న వసతి గృహాలను ఆధునీకరించడంతో పాటు అత్యాధునిక వసతి భవనాల నిర్మాణాలను ప్రారంభించడం ద్వారా భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించారు.

కాలినడక వచ్చే వారి సౌకర్యార్ధం మెట్ల మార్గాన్ని పూర్తిగా ఆధూకరించారు. స్వామివారి ఆర్జిత సేవల్లో దళారుల ప్రమేయాన్ని తగ్గించారు. తిరుమల కొండని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చారు. భక్తుల కోసం ఎలక్టిక్ బస్సులను ఏర్పాటు చేశారు. టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి తన దైన ముద్ర చూపించారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకపోతే పబ్లిసిటీ మీద అంత ఇంట్రెస్ట్ చూపని వైవీ తన హయాంలో జరిగిన వాటిపై అంతగా ప్రచారం చేసుకోలేదు. అయిష్టంగానే చైర్మన్ పదవి చేపట్టినా వైవీ సుబ్బారెడ్డి పదవికే వన్నె తెచ్చారని అంటుంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలగదు. అటువంటిది వైవీ సుబ్బారెడ్డికి రెండు టర్మ్ లు సేవ చేసుకునే భాగ్యం కల్గింది. ఇది నిజంగా శ్రీవారి కృపాకటాక్షమే అనుకోవాల్సి ఉంటుంది. అయితే తమ ప్రాంతానికి చెందిన నాయకుడు ఈ రోజు టీటీడీ చైర్మన్ పదవి నుండి దిగిపోతున్నాడని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆయన వర్గీయులు, అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు.