Srihari: సినిమా పరిశ్రమలో నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్ మధ్య బంధుత్వం ఉండటం అనేది సర్వసాధారణం. కొందరు బంధుత్వాల గురించి అందరికీ తెలిసినా.. కొందరివి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియవు. రియల్ స్టార్ శ్రీహరి, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బంధుత్వం కూడా ఆ కోవకే చెందుతుంది. అయితే దగ్గర బంధువులైనా కూడా శ్రీహరి – ప్రకాష్ రాజ్ మాట్లాడుకునేవారు కాదు. అందుకు కారణం ఏంటి..? అసలు శ్రీహరి, ప్రకాష్ రాజ్ మధ్య ఎలాంటి బంధుత్వం ఉంది..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీహరి.. గొప్ప నటుడు. అంతకంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి. నిరుపేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గా, హీరోగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. భౌతికంగా ఇప్పుడాయన మన మధ్య లేకపోయినా.. సినిమాల ద్వారా మాత్రం సజీవంగా ఉన్నారనడంలో సందేహం లేదు. ఇకపోతే శ్రీహరి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.
అయితే శ్రీహరి ఫ్యామిలీతో ప్రకాష్ రాజ్‌కు చాలా దగ్గరి బంధుత్వం ఉంది. వరసగా శ్రీహరి, ప్రకాష్ రాజ్ తోడళ్ళుల్లు అవుతారు. శ్రీహరి భార్య డిస్కో శాంతి చెల్లెలునే ప్రకాష్ రాజ్ మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు లలిత కుమారి. వీరికి ఇద్దరు కూతుళ్లతో పాటు ఒక కుమారుడు జన్మించాడు. అయితే కుమారుడు చిన్న వయసులో ఓ ప్రమాదంలో చనిపోయాడు. దాదాపు 15 ఏళ్లు కాపురం చేశాక ప్రకాష్ రాజ్ లలిత కుమారికి విడాకులు ఇచ్చాడు.
ఆ సమయంలో ప్రకాష్ రాజ్, లలిత కుమారిలను కలపాలని శ్రీహరి ఎంతగానో ప్రయత్నించారు. ప్రకాష్ రాజ్ కు ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పిల్లల కోసమైనా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని శ్రీహరి బ్రతిమిలాడాడట. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. విడాకులైన ఏడాదికే ఆయన డాన్స్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక లిలత కుమారితో విడిపోవడంతో శ్రీహరి ప్రకాష్ రాజ్‌ను దూరం పెట్టేశారు. అప్పటి నుంచి ఆయనతో మాట్లాడటం మానేశారని అంటుంటారు.