Kajal Aggarwal: సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లికి ముందు ఉన్న క్రేజ్ పెళ్లి తర్వాత ఉండదు. ఒక్కసారి మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెట్టారంటే వారిని హీరోయిన్లుగా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు మరియు హీరోలు మొగ్గు చూపరు. ఎప్పటి నుంచో ఇది ఇలానే కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో కొంత మంది నటీమణులు వివాహం అనంతరం కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ ను రన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో అలియా భట్, కియారా అద్వానీ, దీపిక పడుకొనే వంటి కొందరు తారలు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్నారు.
కానీ దక్షిణాది పరిశ్రమలో మాత్రం అటువంటి పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. ఈ విషయంపై తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2020లో ముంబై కి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 2022లో ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే పెళ్లికి ముందు టాప్ స్టార్స్ కు కాజల్ అగర్వాల్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉండేది. వివాహం తర్వాత మాత్రం పెద్ద హీరోలెవరు ఆమెను పట్టించుకోవడం లేదు.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఇటువంటి పరిస్థితి మారాలంటూ కాజల్ వ్యాఖ్యానించింది. సౌత్, నార్త్ పరిశ్రమలకు తేడా ఉందని.. నార్త్ లో పెళ్లి తర్వాత కూడా హేమ మాలిని, అలియా భట్, దీపిక పడుకొనే వంటి తరాలు రాణించారు. కానీ సౌత్ లో అలా లేదు. ఇక్కడ వివాహమైన హీరోయిన్స్ ను పక్కన పెట్టేస్తున్నారంటూ కాజల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. మొత్తానికి సౌత్ లో హీరోలకు పెళ్లయిన హీరోయిన్లు పనికి రారని పరోక్షంగా కాజల్ కుండబద్దలు కొట్టింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా మరో రెండు రోజుల్లో కాజల్ ప్రధాన పాత్రలో నటించిన `సత్యభామ` సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ శ్రీచరణ్ పాకాల అందించాడు. ఆరం ఆర్ట్స్ బ్యానర్ పై శశి కిరణ్ తిక్కా, బాబీ తిక్కా, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి కలిసి నిర్మించిన సత్యభామ మూవీ జూన్ 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలరించనుంది. నటన పరంగానే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో సైతం మిస్మరైజ్ చేసేందుకు సిద్ధమైంది.