తెలంగాణ యాసతో.. అమాయకత్వపు మాటలతో.. పిచ్చపిచ్చ చేష్టలతో.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ఇటీవల ఛానల్స్ మారుతూ అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతిభ ఉన్నా పరిస్థితి బాగాలేక ప్రాంతాలు మరుకుంటూ.. ఛానల్ మరుకుంటూ.. ఇచ్చిన జీతాలు తీసుకుంటూ నెట్టుకొస్తున్నారు. వి 6 నుండి బయటకు వచ్చిన తరువాత టీవీ9కి వెళ్లిన అయన అక్కడ ఏమైందో ఏమో గాని త్వరగానే బయటికి వచ్చేశారు. తాజాగా సాక్షి లో జాయిన్ అయ్యారు. సాక్షిలో చేరుతూనే ఆ ఛానల్ ను, ఆ ఛానల్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే తన మాజీ ఛానల్ టీవీ9 పై సెటైర్ లు వేస్తూ, ప్రస్తుతం పని చేస్తున్న సాక్షి పై పొగడ్తలు దంచుకుంటూ ఓ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు.
ఈ ప్రోమో చుస్తే ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యేది ఏమిటంటే… ఛానల్ లో నవరంద్రాలు మూసుకొని పని చేసే వారే కొనసాగుతారు, లేకుంటే బయటకు వెళ్లాల్సిందే అన్నట్లుగా పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఏ కారణం చేత తను పాత ఛానల్ వదలాల్సి వచ్చిందో అన్న అంశం ఆధారంగా సత్తి ప్రోమో ఉంది. ఇది తెలుగు ఛానల్స్ లో నూతన సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందను కుంటున్నారు. తెలుగు ఛానల్స్ మధ్య పోటీ ఉన్నప్పటికీ ఒక ఛానల్ పై మరొక ఛానల్ విమర్శలు, సెటైర్ లు వేసుకోవడం గతంలో లేదు. ఒక చానెల్ జోలికి మరొకటి వెళ్లదు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ఛానల్స్ లో అది ఇప్పటి నుండో ఉన్నది. ఒకరికొకరు కౌంటర్ చేసుకుంటూ, సెటైర్లు వేసుకుంటూ, బ్రాండ్ ప్రమోషన్ చేసుకోవడం ఆ ఛానల్స్ లో కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా తెలుగు చానెళ్లలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. దీనికి సాక్షి తెరతీసింది.
ప్రోమోలో ఏముందటే.. ‘న్యూస్ అనుకుంటే న్యూసెన్స్ అయిందా బిడ్డా, నా ఫోటో ఎఫెక్టే కదా అని సత్తి తండ్రి అడగడం.. అవును నాయనా..నోరు, ముక్కు, చెవి రంధ్రాలు అన్నీ మూసుకున్నా, ఐనా ఫలితం లేకపోయే అంటాడు సత్తి. అక్కడ (టీవీ 9) నవరంధ్రాలూ మూసుకోవాలె బిడ్డా, ఇక్కడ ఆ అవసరం లేదు, ఇది (సాక్షి టీవీ) తండ్రిని గౌరవించుకునే జాగా… ఇదే నీ అడ్డా, ఇగ యాడికీ తిరిగేదే లేదు అని ఆ తండ్రి అనడం అది నేరుగా టీవీ9లో ఉన్న పరిస్థితి మీద, తను ఎదుర్కున్న పరిస్థితి మీద సెటైర్ అన్నమాట. సత్తి గాని సత్తా ఏంటిదో చూపిస్త… గుండీలు విప్పుతున్న అంటూ ఇండైరెక్టుగా టీవీ 9కి సత్తి ఛాలెంజ్ విసరడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై టీవీ 9 ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.