పోలీసులపై రాళ్ల దాడి ఘటనలో 11మంది అరెస్టు

లక్నో, డిసెంబర్ 30: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం  ఖాజీపూర్ వద్ద శనివారం జరిగిన రాళ్ల దాడి ఘటనలో కానిస్టేబుల్ మృతికి కారణమైన 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం  ప్రధాని నరేంద్ర మోదీ సభకు అనుమతించకపోవడంతో నిషాద్ పార్టీ కార్యకర్తలు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ సురేష్ వట్స్ మృతి చెందారు. దాడి ఘటనకు సంబంధించి 32మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు.  విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్‌లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిషాద్ సామాజికవర్గం వారు ప్రధాని మోదీ సభకు వెళ్లడానికి ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది.