ఎత్తైన గణేశుడిగా ఖైరతాబాద్ వినాయకుడికి పేరుంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతిసారి ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు విషయంలో రికార్డులు నెలకొల్పుతూ ఉంటారు. ఒక్క అడుగు నుండి మొదలైన ఖైరతాబాద్ గణనాథుని రూపం 60 అడుగుల పైవరకూ చేరి భారతదేశంలోనే అతిపెద్ద గణేశునిగా పేరు సంపాదించారు.


అలాంటిది ఈసారి కరోనా ఎఫెక్ట్ ఖైరతాబాద్ వినాయకునిపై కూడా పడింది. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు 9 అడుగులకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారీ హంగామా ఉండబోవడం లేదు. గతేడాది ద్వాదశదిత్యాయ రూపంలో దర్శనమిచ్చిన గణనాథుడు ఈసారి పర్యావరణ స్నేహ ధన్వంతరీ రూపంలో దర్శనమివ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహం తయారీ పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏదేమైనా ఎప్పుడూ దేశంలోనే ఎత్తైన విగ్రహంగా పేరున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 9 అడుగులకే పరిమితమవడం విచిత్రంగా సందర్శకులకు తోచనుంది.