విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో గత వారం రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగిసింది. మహా యజ్ఞం ముగింపులో భాగంగా ఇవేళ అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. మహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజశ్యామల అమ్మవారు వేంచేసి ఉన్న వైఖానస యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నల్లకలువలతో వేదంత్రోశ్చారణల మధ్య రుత్వికులు, ఘనాపాటీలు, పండితులు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు.

కంచి నుండి ప్రత్యేకంగా తెప్పించిన స్వర్ణ ప్రతి రూపంలో ఉన్న అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేకంగా అభిషేకించారు. తొలుత పాంచరాత్ర యాగశాలలో పూర్ణాహుతికి వెళ్తూ మార్గ మధ్యలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పాదాలను జగన్ నమస్కరించి తనకు ఉన్న భక్తి, గౌరవాన్ని చాటుకున్నారు. కాగా యాగశాలలోకి సీఎం భద్రతా సిబ్బంది సాధారణ దుస్తుల్లో కాకుండా నీలం రంగు పంచెలతో ప్రవేశించి వారి విధులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామి, అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ, మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ నెల 12 నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించారు. మహాయజ్ఞం కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు ముఖ్యమంత్రి జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న తర్వాత మహాయజ్ఞం ప్రారంభమైంది. సీఎం జగన్ గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన . కపిల గోవుకు హారతి ఇచ్చారు. అనంతరం అఖండ దీపారాధనలో జగన్ పాల్గొన్నారు. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు నిర్వహించారు.

వారం రోజుల పాటు ఎంతో వైభవంగా యజ్ఞం జరిగింది. మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిగాయి. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు..తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞం కొనసాగింది. యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు.
సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి .. సీజేఐ ధర్మాసనం ఏమన్నదంటే ..?