మంగళగిరి పోలీసులకు మరో ముప్పు..!? కోర్టు ధిక్కరణ అంటూ హైకోర్టు ఆగ్రహం..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులపై హైకోర్టు మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు అమరావతి రైతుల ఉద్యమాల సందర్భంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా నమోదు చేసిన ఒక కేసులో నిందితులను అరెస్టు చేసే ముందు 41 (ఏ) నోటీసులు ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

విషయంలోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కళ్లాం, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర  పోస్టులు పెట్టారంటూ ముగ్గురిపై మంగళగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఈ నెల 21న మంగళగిరి పట్టణ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ ఉండవల్లికి చెందిన జె సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఏ 2 నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 41 (ఏ) నోటీసులు ఇవ్వలేదనీ పిటిషనర్ తరపు న్యాయవాది సాయికుమార్ వాదనలు వినిపించారు. ప్రస్తుత కేసుల నిందితులపై నమోదు అయిన సెక్షన్‌ల కింద గరిష్టంగా అయిదేళ్ల లోపు శిక్ష మాత్రమే చట్టంలో పేర్కొనబడి ఉందనీ, గరిష్టంగా ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో నిందితులకు 41 (ఏ) నోటీసులు తప్పనిసరిగా ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పోలీసులు సుప్రీం కోర్టు తీర్పును పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనీ, పోలీసులు తమ ఆదేశాలను పాటించకపోతే సంబంధిత హైకోర్టులో దిక్కరణ కేసులు దాఖలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపిన విషయాన్ని న్యాయవాది గుర్తు చేశారు. ఇటువంటి కేసులను సుమోటోగా తీసుకుంటేనే ప్రజాస్వామ్యం రక్షించేందుకు వీలవుతుందనీ, ఫలితంగా సుప్రీం హుందాతనాన్ని కాపాడినట్లు అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయవాది వాదనలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా సిఆర్‌పిసి సెక్షన్ 41 (ఏ) ప్రకారం నిందితులకు పోలీసులు నోటీసులు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని కోర్టు దిక్కరణగా పరిగణించొచ్చని హెచ్చరించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ లలిత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.