సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బుధవారం మళ్లీ ఉద్యోగ బాద్యతలు చేపట్టిన సిబిఐ డైరక్టర్ అలోక్ వర్మ మొదటిరోజునే గతంలో జరిగిన బదిలీలు దాదాపు అన్నిటినీ రద్దు చేశారు. అలోక్ వర్మ పదవికి దూరంగా ఉన్న సుమారు మూడు నెలల కాలంలో ఆయన స్థానంలో మధ్యంతర డైరక్టర్గా పని చేసిన ఎమ్. నాగేశ్వరరావు చాలా మంది అధికారులను బదిలీ చేశారు.
అలోక్ తిరిగి బాధ్యతలు చేపట్టగానే వాటిలో ఎక్కువ భాగం రద్దు చేశారు. సిబిఐ జాయింట్ డైరక్టర్గా అలోక వర్మపై ఆరోపణలు చేసి వివాదం రేకెత్తించిన రాకేష్ ఆస్థానాపై వచ్చిన అవినీతి ఆరోఫణలను దర్యాప్తు చేస్తున్న ముగ్గురు అదికారులను కూడా నాగేశ్వరరావు బదిలీ చేశారు. ఇప్పుడు వారు తిరిగి పాత స్థానానికి వచ్చారు.
డైరక్టర్గా అలోక్ వర్మ అధికారాలను తొలగించి అక్టోబర్లో ఆయనను సెలవుపై పంపిన కేంద్రప్రభుత్వ ఉత్తర్వును సుప్రీంకోర్టు మంగళవారం రద్దు చేసింది. అయితే అలోక్ వర్మ విధానపరమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలని కోర్టు ఆంక్షలు విధించింది. విధానపరమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతనే నాగేశ్వరరావు ఈ బదిలీలు చేశారు కాబట్టి వాటిని తిరగదోడడం కోర్టు విధించిన ఆంక్షల పరిధిలోకి రాదని సిబిఐ వర్గాలు తెలిపినట్లు ఎన్డి టివి పేర్కొన్నది.