సీఎం జగన్ X జస్టిస్ రమణ ; “న్యూస్ ఆర్బిట్” పోల్ ఏం చెప్తుంది..!?

“సీఎం జగన్ X జస్టిస్ రమణ” వివాదంపై “జగన్ ఇలా నేరుగా సుప్రీమ్ న్యాయమూర్తిపై ఆరోపణలు చేయడాన్ని సమర్థిస్తారా..? వ్యతిరేకిస్తారా..? అంటూ “న్యూస్ ఆర్బిట్” ఒక పోల్ నిర్వహించింది. ఆ పోల్ ఫలితాలు, వోటింగ్ తీరు, మా విశ్లేషణను ఇక్కడ అందిస్తున్నాం. ఏపీలో రాజకీయాలు లాగానే ఈ వోటింగ్ లో కూడా అనేక మలుపులు, ట్విస్టులు ఉన్నాయి.

* పోల్ అక్టోబర్ 11 వ తేదీన మొదలైంది. అక్టోబర్ 14 వ తేదీ సాయంత్రానికి 11800 ఓట్లు పోలయ్యాయి. దీనిలో జగన్ లేఖకు మద్దతుగా 52 శాతం.., లేఖ రాయడాన్ని వ్యతిరేకిస్తూ 47 శాతం.., ఏమి చెప్పలేం అంటూ 1 శాతం తమ ఓట్లు ద్వారా సమాధానాలు ఇచ్చారు. ఈ ఓట్లు మాత్రమే మేము పరిగణిస్తున్నాం.

* పార్టీ అభిమానుల్లో అత్యుత్సాహం పెరిగి మొదట వైసీపీ అభిమానులు ఈ పోల్ ని తమ పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో బాగా షేర్ చేసారు. దీంతో అక్టోబర్ 15 సాయంత్రం నుండి కేవలం 12 గంటల వ్యవధిలో 19 వేల ఓట్లు పోలయ్యాయి. ఆ దెబ్బకి పోల్ ఫలితాల్లో జగన్ లేఖకు మద్దతుగా 76 శాతం, వ్యతిరేకంగా 23 శాతం మాత్రమే వచ్చింది. * దీన్ని కనిపెట్టిన టీడీపీ అభిమానులు కూడా అక్టోబర్ 16 మధ్యాహ్నం నుండి 12 గంటల వ్యవధిలో 20 వేల ఓట్లు పోలయ్యాయి. దీంతో జగన్ లేఖకి వ్యతికరేకంగా 54 శాతం, అనుకూలంగా 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇలా చివరికి ఈ రోజు మధ్యాహ్నానికి 49669 ఓట్లతో పోల్ ముగిసింది.

* అందుకే ఈ వోటింగ్ తీరుని క్షుణ్ణంగా పరిశీలించిన “న్యూస్ ఆర్బిట్” మొదటి మూడు రోజుల్లో వచ్చిన 11800 ఓట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. పార్టీల పైత్యంతో అభిమానులు వేసిన ఓట్లు లెక్కించడం లేదు. ఇటువంటి పోల్, ఓటింగ్ అనేది వాస్తవాలు తెలుసుకోడానికి.., క్షేత్ర అభిప్రాయాలు తేల్చడానికి పెడుతుంటాము. వీటిని పార్టీల అభిమానులు మిస్ యూజ్ చేస్తే పోల్ ప్రయోజనం ఉండదు. క్షేత్రస్థాయిలో పార్టీల అభిమానులతో పాటూ.., సామాన్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలనేది మా అభిమతం. పార్టీల అభిమానులు పోల్ లో పార్టిసిపేట్ చేయకూడదు అనేది ఎక్కడా లేదు.. కాకపోతే ఇక్కడ విపరీత షేర్లుతో పార్టీలు మిస్ యూజ్ చేసినట్టు “న్యూస్ ఆర్బిట్” గుర్తించింది. అందుకే ఈ పోల్ లో కొంత మానిప్యులేషన్ జరిగింది కాబట్టి పార్టీల ఓట్లు పరిగణించడం లేదు. జర్నలిజం విలువలకు కట్టుబడి మొదటి మూడు రోజుల్లో వచ్చిన 11800 ఓట్లు మాత్రమే తుది ఫలితంగా భావిస్తున్నాం. అంటే “జగన్ లేఖకు మద్దతుగా 52 శాతం.., లేఖ రాయడాన్ని వ్యతిరేకిస్తూ 47 శాతం.., ఏమి చెప్పలేం అంటూ 1 శాతం తమ ఓట్లు ద్వారా సమాధానాలు ఇచ్చారు. ఇదే ఫలితం..!!