పిల్లలకు దిష్టి చుక్క ఎందుకు పెడుతారో తెలుసా?

నరదృష్టి తగిలితే నల్ల రాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటుంటారు. అంతటి చెడు ప్రభావం నరదృష్టి కి ఉంటుంది. మనం చూసే చూపుల్లో బయటకు ప్రసారమయ్యే కాంతి ఒకరివైపు వ్యతిరేకదిశలో ప్రవహించడం ద్వారా వారికి దిష్టి తగులుతుందని భావిస్తారు. దిష్టి తగిలినప్పుడు తీవ్రమైన తలనొప్పి, కాళ్లు లాగడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మన పెద్దలు కొద్దిగా ఉప్పు తో మూడు సార్లు దిష్టి తీసి ఉప్పు నీటిలో వేస్తారు. ఆ ఉప్పు కరిగే లోపు మనకు దిష్టి తొలగిపోతుందని వారి నమ్మకం. ముఖ్యంగా చిన్న పిల్లల మీద ఇలాంటి దుష్ట ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే పిల్లలు కొద్దిగా పెరిగి పెద్దయ్యే వరకు వారి బుగ్గన దిష్టి చుక్క పెడుతూ ఉంటారు. ఇలా దిష్టి చుక్క పెట్టడం వల్ల చెడు ప్రభావంతో చూసే వారి చూపును ఆ కాటుక ఆకర్షిస్తుందని మన నమ్మకం.

కొంతమంది పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తూ ఉంటారు అటువంటి వారికి కొద్దిగా అన్నం తీసుకుని పసుపు కుంకుమ రాసి దిష్టి తీసి బయటకు పడేయడం వల్ల వారికి ఆ దిష్టి తొలగిపోతుంది. తరచూ పిల్లలు ఆడుకుంటూ ఎన్నో సార్లు కింద పడుతూ ఉంటారు. అలా పడటం ద్వారా కొన్నిసార్లు నిద్రలో ఉలిక్కిపడుతూ, తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు పడిన చోట కొద్దిగా పసుపు సున్నం కలిపిన నీటిని అందులో కర్పూరం వేసి మూడు సార్లు దిష్టి తీసి పక్కకు పడేయడం ద్వారా పడిన దోషం పోతుందని భావిస్తారు.

అయితే ఇలాంటివి కేవలం వారి మూఢనమ్మకాలు మాత్రమే నని వారి అవసరాల కోసం దిష్టి అనే మూఢ నమ్మకాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించటం ద్వారా వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని ప్రజలు ఎంతో నమ్మకంగా భావిస్తున్నారు.