సైకిల్ ఎక్కబోతున్న జెడి ?

అమరావతి, మార్చి 12: రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ ఒకటి రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఆయన్ను టిడిపిలో చేరేందుకు ఒప్పించారని ప్రచారం జరుగుతోంది. విశాఖ లేదా భీమిలి అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్మోహనరెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు దర్యాప్తు బాధ్యతలను సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) హోదాలో  వివి లక్ష్మీనారాయణ నిర్వహించారు. దీంతో ఆయన పేరు జెడి లక్ష్మీనారాయణగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనంతరం ఆయన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు.

రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలన్న తలంపుతో వివి లక్ష్మీనారాయణ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చంద సంస్థలు, కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సెమినార్‌లలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని సందేశాలు ఇచ్చారు. విద్యార్థులకు క్యారీర్ గైడెన్స్‌పై మంచి సందేశాలను ఇచ్చారు. పలు ప్రాంతాలను పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.

ప్రజా ప్రతినిధిగా ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని కూడా పలు సందర్భాల్లో లక్ష్మీనారాయణ వెల్లడించారు. తనకు వ్యవసాయం అంటే ఎక్కువగా ఇష్టమని, వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఇటీవల వరంగల్లు జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నానని చెప్పారు.

ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు నిర్వహిస్తుంటే ఎన్నికల సమయానికి జనసేన లేదా లోక్‌సత్తా పార్టీలో చేరతారని ఎక్కువ మంది భావించారు.

ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.

మంత్రి ఘంటా శ్రీనివాసరావు హైదరాబాదులో లక్ష్మీనారాయణ నివాసానికి వెళ్లి  సంప్రదింపులు జరపడంతో ఆయన టిడిపిలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా  తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో లక్ష్మీనారాయణ టిడిపి కండువా కప్పుకోనున్నారు.