మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎలాంటి నిర్మాత అయినా కోరుకుంటాడు. అయినకున్న క్రేజ్, మార్కెట్ అలాంటిది మరి. అలాంటి లిస్టులో దిల్‌రాజు కూడా ఉన్నాడు. సినిమా రంగంలోకి డిస్ట్రిబ్యూటర్‌గా అడుగుపెట్టి, నిర్మాతగా మారిన దిల్‌రాజు రెండు దశాబ్దాల అనుభవాన్ని సంపాదించుకున్నాడు. నేటితరం స్టార్ హీరోలు మహేశ్, చరణ్ ,ఎన్టీఆర్, బన్ని.. ఇలా అందరితో సినిమాలు చేశాడు. కానీ ఒకప్పటి స్టార్ కథానాయకుల్లో చిరంజీవితో సినిమా చేయడానికి దిల్‌రాజు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. కానీ దిల్‌రాజు స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగే సమయానికి చిరు రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. దిల్‌రాజు చిరుతో సినిమా చేయలేనేమోనని అనుకునేశాడు.. అయితే చిరు రీ ఎంట్రీ తర్వాత దిల్‌రాజు తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తాజాగా దిల్‌రాజుతో సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినపడుతున్నాయి.
ప్రస్తుతం చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత చిరు 153వ సినిమా ఉంటుంది. దీన్ని దిల్‌రాజు నిర్మిస్తాడు. మంచి కథ, డైరెక్టర్‌ను సిద్ధం చేసుకుని వస్తే తాను సినిమా చేస్తానని దిల్‌రాజుకు చిరు ఆఫర్ ఇచ్చాడని టాక్. చిరు 153వ సినిమా అంటే వచ్చే ఏడాదే ఉంటుంది కాబట్టి.. దిల్‌రాజు తన ప్రయత్నాలు ఇప్పటి నుండి ప్రారంభించేశాడని టాక్.